దుండిగల్,ఫిబ్రవరి2: భర్తతో తలెత్తిన విబేధాలతో సోదరుడి ఇంటికి వచ్చిన వివాహిత అదృశ్యమైన సంఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…ఒడిశాకు చెందిన రాజమాలి బతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చి నగరశివారు సుభాశ్‌నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ, పాండుబస్తీలో కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. పెయింటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో రాజమాలి సోదరి రశ్మీఆనంద్ సొంతగ్రామంలోని తన భర్తతో గొడవపడి తల్లితో కలిసి అన్నవద్దకు వచ్చి ఉంటుంది.అప్పటి నుంచి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ పరిశ్రమలో పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 30న కంపెనీలో పనికి వెళ్లిన రశ్మీఆనంద్ సాయంత్రమవుతున్నా తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన రాజమాలి తన సోదరి ఆచూకీ కోసం పరిసర ప్రాంతాల్లో వెతకడంతో పాటు బంధువులు, స్నేహితుల ఇండ్లల్లో ఆరా తీశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆదివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటర్ విద్యార్థిని ..
దుండిగల్: ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన సూరారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం..కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాశ్‌నగర్ డివిజన్ పరిధి, సూరారంకాలనీ, సాయిబాబానగర్‌లోని ఆర్వీ మోడల్‌స్కూల్ సమీపంలో నివాసముంటున్న శంకర్ కుమార్తె బాలఅక్షయ చింతల్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 30న రోజు మాదిరిగానే కళాశాలకు వెళ్లిన బాల అక్షయ సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు బాలఅక్షయ ఆచూకీకోసం బంధువులు, స్నేహితుల ఇండ్లల్లో ఆరా తీశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో సూరారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.