Hyderabad | వెంగళరావునగర్, జూలై 10 : ఈడొచ్చిన కుమార్తెకు పెళ్లి సంబంధం కోసం షాదీ డాట్ కంలో పోస్ట్ చేస్తే.. ఆ వివరాలను టెలిగ్రామ్ గ్రూపులలో పోస్ట్ చేసి పోకిరీలు వేధింపులకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం ఎస్ఆర్ నగర్లో నివాసముండే యువతి (27) ఓ బ్యాంకులో ఉద్యోగిని. పెళ్లీడుకొచ్చిన ఆమెకు వివాహ సంబంధాల ప్రయత్నాల్లో భాగంగా ఆమె వివరాలను షాదీ డాట్ కంలో ఆమె తల్లి పోస్ట్ చేశారు. ఆ వివరాలను టెలిగ్రామ్లో పోకిరీలు పోస్ట్ చేశారు. దాంతో ఫోన్ చేసి, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఆమెకు పోకిరీల నుంచి అసభ్యకరమైన సందేశాలు వచ్చాయి. మీరు మ్యాచ్ కోసం ప్రయత్నిస్తున్నారా.. మీకు ఆసక్తి ఉంటే మాట్లాడుకుందామా.. మీ ప్రొఫైల్ నాకు నచ్చింది.. నాకు ఆసక్తి ఉందంటూ పోకిరీల నుంచి మెసేజులు వచ్చాయి. వాట్సాప్ కాల్స్ చేస్తూ ఆమెను విసిగించేవారు. నాయుడు ఫ్రీ మ్యాట్రిమోని అనే యూజర్ రెండు వేర్వేరు గ్రూపుల్లో ఒకే రకమైన డేటాను ఒకేసారి షేర్ చేయడాన్ని గమనించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెలిగ్రామ్ గ్రూపులో తన వ్యక్తిగత వివరాల్ని పోస్టు చేసిన ఆగంతకుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్.ఆర్.నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.