Krishna Pavani | దుండిగల్: ఓ వైపు అనారోగ్యం.. మరోవైపు కుటుంబకలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. తాను విషం తాగడంతో పాటు కూతురికి తాగించింది. చికిత్స పొందుతూ కూతురు చనిపోగా, తల్లి చికిత్స పొందుతున్నది. బాచుపల్లి పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని బాపట్లకు చెందిన నంబూరి సాంబశివరావు, కృష్ణ పావని (32) దంపతులు నాలుగేండ్ల కూతురు జశ్వికతో కలిసి బాచుపల్లి, ఆదిత్య గార్డెన్ కాలనీలో ఉంటున్నారు.
సాంబశివరావు నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కృష్ణ పావని కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ విషయంలో అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 18న భర్త ఇంట్లో లేని సమయంలో పావని కూల్ డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాను తాగడంతో పాటు కూతురుకి తాగించింది. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సాంబశివరావు ఇద్దరిని వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ జశ్విక చనిపోయింది. కృష్ణ పావని చికిత్స పొందుతున్నది.