బంజారాహిల్స్ జూలై 11: బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు మేకప్ స్టూడియో యజమానురాలిని వేధింపులకు గురి చేస్తున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. హర్జిత్ కౌర్ గరపాటి (43) అనే మహిళ బంజారా హిల్స్ రోడ్ నెం.14లో హెచ్‌కే హర్జిత్ కౌర్ హెయిర్ అండ్ మేకప్ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నారు. ఆమెకు ఏడాది నుంచి విజయ్ వాచర్, సోన్ వాచర్, హసన్ షాన్, అనూర్ వాచర్ అనే వ్యక్తులు పరిచయం ఉన్నారు. కాగా కొన్నాళ్ల క్రితం సోన్ స్టైలిస్ట్‌గా స్టూడియోలో చేరారు,తాను డెర్మా క్లినిక్ నిర్వహించుకుంట అని చెప్పడంతో తన స్టూడియోలో సోన్ కోసం హార్జిత్ కౌర్ స్థలం ఇచ్చారు. కాగా, హర్జిత్ కౌర్ తన పాస్‌పోర్ట్‌ను స్టూడియోలో ఉంచగా అది విజయ్, సోన్ తీసుకున్నారు.
కాగా తన పాస్‌పోర్ట్ తిరిగి ఇవ్వాలని అడిగితే, వారు తిరస్కరించడంతో పాటు, దుర్భాషలు, బెదిరింపులు చేశారు. ఈ వ్యవహారంలో గొడవ చోటు చేసుకోవడంతో హసన్, సోన్ ఆమెపై దాడి చేశారు. పాస్ పోర్ట్ తిరిగి ఇవ్వాలంటే డబ్బు డిమాండ్ చేయగా రూ.11,000 విజయ్‌కు ట్రాన్స్ఫర్ చేసింది. దాంతో పాస్ పోర్ట్ తిరిగి ఇచ్చారు. కాగా కొన్నాళ్ల తర్వాత మరిన్ని డబ్బులు ఇవ్వాలని..లేకుంటే మీమీద తప్పుడు కేసులు పెట్టిస్తామని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. తనతో పాటు తన భర్తకు ఫోన్లు చేయడం, తమ నంబర్లను గేమింగ్ సైట్స్ లో పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు బాధితురాలు హార్జిత్ కౌర్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.