బంజారాహిల్స్, డిసెంబర్ 25 : తన కుమార్తె అందంగా కనిపించాలని గత కొంతకాలంగా బ్యూటీ క్లినిక్‌లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్న మహిళ.. ట్రీట్మెంట్ డబ్బులు అడిగే సరికి క్లినిక్‌లో పనిచేస్తున్న సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు రేప్ చేయిస్తానంటూ బెదిరింపులకు దిగింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 1లోని సీవీఆర్ చానల్ పక్కన వీవీసీ పార్క్ కాంప్లెక్స్‌లో ఉన్నడా. జమునా పాయ్ స్కిన్ ల్యాబ్‌లో కొంత కాలం గా తన్వీర్ తబస్సుమ్ అనే యువతి అందంగా కనిపించేందుకు పీల్ ట్రీట్మెంట్ తీసుకుంటోంది. జనవరిలో తన కుమార్తెకు పెళ్లి కుదిరిందని ఆమె తల్లి పర్వీన్ బేగం వచ్చి ఫీజు గురించి మాట్లాడింది. మొత్తం ప్యాకేజ్ రూ.2.19 లక్షలు అవుతుందని, ట్రీట్మెంట్ చేసే విధానాన్ని వివరించగా అందుకు ఆమె అంగీకరించారు. అడ్వాన్స్‌గా రూ.1లక్ష చెల్లించి.. ట్రీట్మెంట్ ముగిసేలోగా మిగిలిన డబ్బు చెల్లిస్తానని చెప్పింది. దీంతో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 23న సాయంత్రం తన్వీర్ తబస్సుమ్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంది. ఒకటి రెండు సెషన్స్ పూర్తయితే ట్రీట్మెంట్ పూర్తవుతుందని మిగిలిన డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో తాను డబ్బులు తీసుకువస్తానంటూ తల్లి పర్వీన్ బేగం బయటకు వెళ్లింది.
సుమారు రెండు గంటలు గడిచినా ఆమె తిరిగి రాకపోవడంతో క్లినిక్ సిబ్బంది అమెకు ఫోన్లు చేశారు. సుమారు 10 నుంచి 15 సార్లు కాల్ చేసినా స్పందించలేదు. కాగా, రెండు గంటల తర్వాత క్లినిక్‌కు వచ్చిన పర్వీన్‌బేగం అత్యంత జుగుప్సాకరమైన బాషను ఉపయోగిస్తూ మహిళా వైద్యులను, సిబ్బందిని బూతులు తిట్టడం ప్రారంభించింది. నా గురించి మీకు తెలియదు.. ఇప్పుడే కాల్ చేసి మగవాళ్లను పిలిపించి నడిరోడ్డుపై రేప్ చేయిస్తా.. అంటూ వీరంగం వేయడంతోపాటు అడ్డుకునేందుకు యత్నించిన సిబ్బందిపై దాడి చేసింది. అంతటితో ఆగకుండా టేబుల్ గ్లాస్‌ను పగలగొట్టింది. అద్దాన్ని చేతిలో ఆయుధంలా పట్టుకుని చంపేస్తానంటూ బెదిరించడంతో పాటు అడ్డుకునేందుకు వచ్చిన క్లినిక్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న చెన్నయికి చెందిన వైద్యురాలిపై దాడిచేసి మూడో ఫ్లోర్ నుంచి కిందకు తోసేస్తానంటూ లాగింది. దీంతో క్లినిక్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది, వైద్యులు పరుగులు తీశారు. సుమారు అరగంట పాటు క్లినిక్‌లో వీరంగం సృష్టించిన పర్వీన్‌బేగం, ఆమె కుమార్తె తబస్సుమ్‌తో కలిసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో షాక్‌కు గురయిన క్లినిక్ ఇన్చార్జి మంగళవారం రాత్రి జూబ్లీహి ల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితురాలు పర్వీన్‌బేగం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.