మన్సూరాబాద్, జనవరి 21: ఆటోనగర్ ప్రాంతం నుంచి వస్తున్న రసాయనాల దుర్వాసన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన ట్రంక్‌లైన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న వ్యర్థ రసాయనాల దుర్వాసనను అరికట్టేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాల ప్రకారం ఆటోనగర్ డంపింగ్ యార్డు వద్ద ఉన్న కల్వర్టు నుంచి ఎరుకల నాంచారమ్మకాలనీ సమీపంలోని ట్రంక్‌లైన్‌కు అనుసంధానం చేసే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని శనివారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి టీఎస్ఐఐసీ వేసిన ట్రంక్‌లైన్ ద్వారా రసాయనాలు, ఇండస్ట్రియల్ వేస్టేజ్ డంపింగ్ యార్డు వద్ద ఉన్న కల్వర్టు వద్దకు చేరుకుని నిలిచిపోతుందని తెలిపారు. సదరు వ్యర్థ రసాయనాలతో భూగర్భ జలాలు కలుషితం అవ్వటమే కాకుండా గాలిలోకి విష వాయువులు చేరి భయంకరమైన దుర్వాసనలు వ్యాప్తి చెందుతుందని తెలిపారు.
గాలిలోకి చేరుతున్న విష వాయువుల వలన ప్రజలు అనారోగ్యాల బారినపడటమే కాకుండా కొందరు సొంత గృహాలను ఖాళీ చేసి వెళ్లే దుస్థితి నెలకొందని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒక కాలపరిమితి పెట్టుకుని ట్రంక్‌లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా అంచనా వ్యయాలను సిద్ధం చేయాలని కోరారు. ఈ విషయాలపై ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి సెక్రటరీ నీతూకుమారి ప్రసాద్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ వెంకట నర్సింహారెడ్డికి డంపింగ్ యార్డు నిర్మూలన సమితి వినతి పత్రాలను అందజేసి సమస్యను వివరించడం జరిగిందని పేర్కొన్నారు. సమస్య తీవ్రతను గుర్తించి వెంటనే పనులు చేపట్టే విధంగా చొరవ చూపాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను కోరారు. ఈ కార్యక్రమంలో డంపింగ్ యార్డు నిర్మూలన సమితి అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, వివిధ కాలనీల ప్రతినిధులు గోపికృష్ణారెడ్డి, చంద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, మార్గం రాజేశ్, శ్రీకాంత్, బాల్‌రెడ్డి, భాస్కర్, వాసుయాదవ్, రవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి
ఎల్బీనగర్, జనవరి 21 : పరిసరాల పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. శనివారం గడ్డిఅన్నారం డివిజన్ గౌతంనగర్ కాలనీలో పరిసరాల పరిశుభ్రతపై నిర్వహించిన అవగాహన సదస్సు, ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. ప్రతి రోజు ఇంట్లోని తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త ఆటోలకే అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేంమహేశ్వర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ ప్రవీణ్‌కుమార్, గౌతంనగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి కళ్లెం మధుసూదన్‌రెడ్డి, సాయి గ్రామర్ స్కూల్ శిరీషతో పాటు పలువురు పాల్గొన్నారు.