సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌కు ఇప్పట్లో కొత్త బస్సులు వచ్చే అవకాశం కనిపించడం లేదు. మహాలక్ష్మి పథకం అమలుతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం నగరంలో ఉన్న సిటీ బస్సులు సరిపోవడం లేదు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు కొత్త బస్సులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన సర్కారు కేవలం ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి చేతులు దులుపుకున్నది. కాని, ఆ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి? అమలు చేయడానికి ఉన్న సమస్యలేమిటీ? అమలులో భాగంగా ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా అధిగమించాలి? అధిక ప్రయాణికుల నేపథ్యంలో.. తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం నగరంలో మహాలక్ష్మి పథకం కోసం 3500 సిటీ బస్సులు అవసరం. కానీ, ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి 2650 మాత్రమే. వాటిలో దాదాపు 300 వరకు అద్దె బస్సులు, 1000 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు పోగా.. మిగిలినవి ఆర్డినరీలు. అదనంగా 900 బస్సులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. కొత్త బస్సులు తీసుకొస్తే.. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలు కూడా చేయాల్సిన పరిస్థితులున్నాయి. ఉచిత బస్సు పథకం ఆర్టీసీకి తలకు మించిన భారంగా మారిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో అవసరమైన కొత్త బస్సులు ఇప్పట్లో నగరానికి వచ్చే అవకాశం లేదు. ఈ లోగా మహాలక్ష్మి పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి అన్న ఆలోచనలో అధికారులు తలమునకలయ్యారు. నగరంలో 15 సంవత్సరాలు నిండి, కాలం చెల్లిన బస్సులు దాదాపు 1100 పైగా ఉన్నాయి. వీటినే నగరంలోని అన్ని మార్గాల్లో తిప్పుతుండగా.. కాలుష్యం విపరీతంగా వస్తున్నది. వాటిని త్వరలోనే స్క్రాప్‌కు పంపించనున్నారు. ఈ క్రమంలో 600 సిటీ బస్సులను రిప్లేస్ చేయబోతున్నారు. ఇందుకు జిల్లాలో తిరుగుతున్న దాదాపు 600 సూపర్ లగ్జరీ బస్సులను నగరంలో నడిపించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలు తిరిగిన బస్సులను నగరానికి తీసుకురానున్నారు. ఆ బస్సులను సిటీ బస్సులకు అనుగుణంగా మార్పులు చేస్తారు. వచ్చే జూన్ లేదా జూలై నాటికి 500 విద్యుత్ బస్సులను కొత్తగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.