Bandlaguda | బండ్లగూడ, జూన్ 1: పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో గత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టి అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ప్రజల మౌలిక అవసరాలను తీర్చాల్సిన అధికారులు నిర్లక్ష్యంతో వహించడంతో ప్రస్తుతం సమస్యలు ఏకరువు పెడుతున్నాయి. నగర శివారు ప్రాంతమైన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజురోజుకు జనసాంద్రత పెరగడంతో పాటు నగరాన్ని అనుకొని ఉండటంతో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన దుకాణాల సముదాయాలతో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ నగరాన్ని తలపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాల కోసం కార్పొరేషన్ పరిధిలో పలు ప్రాంతాలలో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా లక్షల రూపాయలు వెచ్చించి సౌచాలయాలను ఏర్పాటు చేశారు.
కొంతకాలం వీటి నిర్వహణ బాగానే ఉండడంతో ప్రజలు వీటిని ఆశ్రయించారు. కానీ ప్రస్తుతం అధికారులు సౌచాలయాలలో కనీస వసతులు చేపట్టకపోవడంతో పాటు వాటి నిర్వహణ లోపంతో తాళాలు వేయాల్సి వచ్చింది. దీంతో ప్రజలు అత్యవసర సమయాల్లో అనేక ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆరోపించారు. వెంటనే అధికారులు సౌచాలయాల తాళాలు తెరిచి వాటిని వినియోగంలోకి తేవాలని స్థానిక ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా పలు ప్రాంతాలలో వృథాగా పడిన సౌచాలయ డబ్బాలను తిరిగి వాడుకలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.