హైదరాబాద్: మద్యం ప్రియులకు అలర్ట్. హైదరాబాద్‌లో రెండు రోజులు వైన్స్ షాపులు (Wine Shops) మూతపడనున్నాయి. వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 17) ఉదయం 6 గంటల నుంచి బుధవారం (18వ తేదీ) సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులను బంద్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్ షాపులతోపాటు రెండు రోజులపాటు కల్లు దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. స్టార్ హోటల్ బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఇది వర్తించదని వెల్లడించారు.
ఈ నెల 17న ఖైరతాబాద్ వినాయకుడితోపాటు నగరంలోని గణేష్ విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలకు భంగం కలుగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని మద్యం, కల్లు దుకాణాలు మూసేయనున్నారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమించి షాపులు తెరిచినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.