నిజామాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారును సాగనంపి.. దేశంలోని మొత్తం రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇస్తానని ప్రకటించారు. దేశ రాజకీయాల్లో మార్పుకోసం పిడికిలి బిగించాల్సిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభా వేదికపై బీజేపీ పరిపాలన తీరుపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారాయన.
అంతకు ముందు ఎల్లమ్మగుట్టలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, బైపాస్ రోడ్డులో రూ.58కోట్లతో నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, సురేందర్, బిగాల గణేశ్‌గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీగౌడ్, డి.రాజేశ్వర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదార్ శోభ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ముక్త్ భారత్..
నేను బయలుదేరిన నాడు ఒక్కడినే. ఆ తర్వాత సముద్రమై ఉప్పొంగి రాష్ర్టాన్ని తెచ్చుకున్నాం. అలాగే.. మత పిచ్చి, అప్రజాస్వామిక విధానాలు, లంచగొండితనం, కుంభకోణాల మయమైన దరిద్రపు గొట్టు బీజేపీని సాగనంపుదాం. వచ్చేది మన ప్రభ్వుతమే. 2024లో బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో దేశం మొత్తానికి ఉచిత కరెంట్ ఇస్తానని ఈ గడ్డ మీద నుంచి ప్రకటిస్తున్నా.
అమ్ముడు.. అన్నీ ఖతం చేసుడు
ఈ మోదీ ఒక్కటైనా ప్రాజెక్టు కట్టిండా. ఓ ఫ్యాక్టరీ పెట్టిండా. విమానాలు అమ్మిండు, ఓడరేవులు అమ్మిండు, రైళ్లు, కార్ఖానాలు, బ్యాంకులు అమ్మిండు. అమ్ముడు.. ఉన్న వాటిని ఖతం చేసుడు తప్ప వీళ్లకు ఏం తెలుసు. మోదీ పరిపాలనలో రూపాయి విలువ పతనం అవుతున్నది. చేసిన మంచి పని లేదు. దళిత, గిరిజనుల గురించి ఆలోచన చేసింది లేదు. మహిళల గురించి పట్టింపే లేదు.
సూట్‌కేసులతో రెడీగా ఉన్నరు..
దేశమే ఆశ్చర్యం పోయే విధంగా రైతును కాపాడుకుంటున్నాం. దేశం కూడా బాగు పడాలే. ప్రధాని మోదీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిండు. పంటకు ధర మాత్రం ఇయ్యడు. దీని వెనక బలమైన కుట్ర దాగి ఉంది. ధరలు రాక మనం నాశనం అయితే మీ భూములు కొనేందుకు సిద్ధంగా మోదీ దోస్తులు సూట్‌కేసులు పట్టుకుని రెడీగా ఉన్నారు. రైతులను వారి వద్ద కూలీలుగా చేయాలనే కుట్ర జరుగుతున్నది. మొన్ననే 28 రాష్ర్టాల నుంచి రైతు సోదరులు వచ్చి దేశం కోసం పిడికిలి బిగించేందుకు రమ్మని కోరారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు పోదామా. తెగిద్దామా. – సీఎం కేసీఆర్
నిజామాబాద్‌లో జరిగిన ముఖ్యమంత్రి సభకు ఫ్లకార్డులతో వస్తున్న రైతులు, మహిళలు
కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్‌గుప్త, హన్మంత్ షిండే, షకీల్ అహ్మద్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు
నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
సభకు హాజరైన ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్త, హన్మంత్ షిండే, షకీల్ అహ్మద్, విద్యాసాగర్‌రావు