Attapur | బండ్లగూడ, జూన్ 22 : అత్తాపూర్లోని అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం అభివృద్దికి దేవాదాయ శాఖ చర్యలు ప్రారంభించింది. ఇందుకు మొదటిసారిగా దేవాలయ అభివృద్ది కోసం పాలక మండలి నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదిలా ఉంటే అనంత పద్మనాభ స్వామి దేవాలయం చైర్మన్ పదవిని దక్కించుకోవాలని స్థానిక నాయకులు ఆరాటపడుతున్నారు. చైర్మన్ పదవిని ఎలగైనా దక్కించుకోవాలనే లక్ష్యంతో నాయకులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేతో పాటు మంత్రి, ముఖ్యమంత్రి చూట్టు ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం శిథిలావస్థలో ఉంది. కనీసం దూప దీప నైవేద్యాలకు కూడా నోచుకోవడం లేదు. ఇప్పటి వరకు ఈ దేవాలయం అక్కడి అర్చకుల సమక్షంలో నిర్వహించబతుంది. కాగా ఈ దేవాలయం అనేక సంవత్సరాలుగా దేవాదాయ శాఖ ఆధీనంలో ఉండటంతో వారు దేవాలయం అభివృద్ది చేయాలనే లక్ష్యంతో పాలక మండలి ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. కాని అక్కడి అర్చకులు అడ్డుకుంటు వచ్చారు. ఇటివల మరోసారి దేవాదాయ శాఖ వారు అర్చకుల సహకారంతో మరల నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు నూతన పాలక మండలి కోసం దరఖాస్తులను ఆహ్వానించారు.
అయితే మెదటి సారిగా అనంత పద్మనాభస్వామి దేవాలయం పాలక మండలి నోటిఫికేషన్ రావడంతో స్థానిక నాయకులు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు స్ధానికులతో పాటు స్థానికేతరులు అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా పాలక మండలి చైర్మన్ దక్కించుకునేందుకు కొంత మంది గతంలో దేవాలయ భూములను కబ్జాలు చేసి అందులో ఇండ్లు నిర్మించుకుని వ్యాపారాలు చేస్తున్న వారు కూడ దరఖాస్తు చేసుకున్నారని స్థానిక ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నొ ఏళ్ల తర్వాత అనంత పద్మనాభ స్వామి దేవాలయం అభివృద్దికి దేవాదాయ శాఖ వారు నూతన పాలక మండలి ద్వారా కృషి చేస్తుంటే దేవాలయ భూములను కబ్జా చేసిన వారికి పదవులు కట్టబెడితే మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అలాంటి వారికి పదవులను ఇవ్వకూడదని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.