మేడ్చల్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ): ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు రుణాలు ఎప్పుడిస్తారని మహిళా సంఘాల సభ్యులు ఎదురు చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పురపాలక సంఘాల్లోని పేద మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నా.. ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ఈ పథకం కింద మహిళా సంఘాల్లోని పేద మహిళలలకు ఉపాధి కల్పనలో భాగంగా వివిధ ఉపాధి సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు రూ. 51 కోట్లను మంజూరు చేసినట్లు చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటి వరకు రుణాలు ఇవ్వలేదు.
జిల్లాలోని నిజాంపేట్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, బోడుప్పల్, మేడ్చల్, తూంకుంట, నాగారం, దమ్మాయిగూడ, కొంపల్లి, దుండిగల్, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి పురపాలక సంఘాల్లో 7,245 మహిళా సంఘాలు ఉండగా వివిధ సంఘాల్లోని మహిళలకు రూ.51కోట్ల రుణాల ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉపాధి కల్పనలో భాగంగా మహిళా సంఘాలకు రూ. 26 కోట్లు వెచ్చిస్తామని అధికారులు చెబుతుండగా వ్యక్తిగతంగా నిరుపేద మహిళలు చిన్న తరహా ఉపాధి సంస్థల ఏర్పాటుకు సంబంధించి రూ.25 కోట్లు అందజేయాలని నిర్ణయించినప్పటికీ అమలయ్యేది ఎప్పుడోనని మహిళలు పెదవి విరుస్తున్నారు.
రుణాలు ఇచ్చేది వీటికే…
మహిళా సంఘాలకు క్యాంటీన్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, మీ సేవా కేంద్రం, స్ట్రీట్ వెండర్, కోల్డ్‌స్టోరేజీ యూనిట్లతో పాటు క్యాటరింగ్ సర్వీస్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రుణాలు ఇచ్చే విధంగా నిర్ణయించారు. నిరుపేద మహిళల వ్యక్తిగత రుణాలకు సంబంధించి బేకరి, డెయిరీ ప్రొడక్ట్స్, కూరగాయలు, పండ్ల దుకాణాలు, మైక్ సెట్, బ్యూటీ వెల్నెస్ సెంటర్లు, టెంట్‌హౌజ్, ఫ్యాన్సీ స్టోర్, కిరాణ జనరల్ స్టోర్స్, ఫుడ్‌కు సంబంధించిన దుకాణాలను ఏర్పాటు చేసుకోవచ్చు. జిల్లాలోని అధికార యంత్రాంగం మాత్రం రుణాల మంజూరుకు మహిళా సంఘాల ఎంపికలో నిమగ్నమయ్యారు. రుణాల మంజూరుకు అర్హులైన మహిళా సంఘాలతో పాటు వ్యక్తిగత రుణాలు అందించేలా కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రుణాల మంజూరు మాత్రం ఎప్పుడు చేస్తారన్నది ఎదురు చూడాల్సిన పరిస్థితి.