Dimple Hayathi | సినీ నటి డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీసీపీ కారును ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడంతో పాటు పార్కింగ్ ప్లేస్‌లో అడ్డంకులు సృష్టిస్తుండటంతో డింపుల్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డీసీపీ కారుపై దాడికి పాల్పడటానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకొచ్చినప్పటికీ తన తప్పేమీ లేదని డింపుల్ వాదిస్తోంది. అంతేకాదు దీనిపై న్యాయపోరాటానికి వెళ్తానంటూ కోర్టును ఆశ్రయిస్తానని తెలిపింది. డింపుల్‌తో తనకు గొడవలేమీ లేవని.. ఆమెనే తనను ఇబ్బంది పెడుతోందని రాహుల్ హెగ్డే ఆరోపించారు. పోలీసుల విచారణలోనే అన్ని విషయాలు బయటపడతాయని చెప్పుకొచ్చారు.
జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ హుడా ఎన్‌క్లేవ్‌లో ఉన్న ఎస్కేఆర్ ఎన్క్లేవ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసముంటున్న ఐపీఎస్ అధికారి నగర ట్రాఫిక్ విభాగంలో డీసీపీగా పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా సెల్లార్‌లోని పార్కింగ్ ప్లేస్ విషయంలో డింపుల్ హయతికి, డీసీపీ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎం.చేతన్ మధ్య వివాదం కొనసాగుతోంది. డింపుల్ హయతి, విక్టర్ డేవిడ్ తమ బీఎండబ్ల్యూ కారును డీసీపీకి చెందిన అధికారిక వాహనానికి అడ్డుగాపెట్టడంతో డీసీపీ కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగుతుండేవారు. తమ కారును తీసేందుకు వీలుగా కారు పార్క్ చేయాలని చెప్పినా వినిపించుకోకుండా పలుమార్లు అడ్డంకులు సృష్టించారు. ఈ క్రమంలోనే ఈ నెల 14న తమ అపార్ట్మెంట్లోని సెల్లార్లో పార్క్ చేసిన డీసీపీ అధికారిక వాహనాన్ని తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి డింపుల్ హయతి ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా డీసీపీ కారుకు ఇతర వాహనాలు తగలకుండా పెట్టిన కోన్స్‌ను కాలితో తన్నేసి వీరంగం సృష్టించింది. ఇదేంటని కానిస్టేబుల్ చేతన్ ప్రశ్నించడంతో అతనితో గొడవకు దిగింది. దీంతో డీసీపీ డ్రైవర్ చేతన్ కుమార్ మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు డింపుల్ హయతితో పాటు ఆమె స్నేహితుడిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనంతరం సీఆర్పీసీ 41(ఏ) కింద నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే డింపుల్ హయతి, విక్టర్ డేవిడ్‌ను సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు కావడంతో డింపుల్ హయతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం బయటకొచ్చింది. రాహుల్ హెగ్డే కారుపై డింపుల్ హయతి దాడి చేయడానికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు బయటకొచ్చినప్పటికీ.. తనవైపు ఏ తప్పులేదని వాదిస్తోంది. ఈ క్రమంలోనే డీసీపీని ఉద్దేశించి తన పేరును ప్రస్తావించకుండా మంగళవారం ఉదయం డింపుల్ హయతి ఓ ట్వీట్ చేసింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పిపుచ్చుకోలేరంటూ అందులో పేర్కొంది. అంతటితో ఆగకుండా ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తానని డింపుల్ అంటోంది. డింపుల్ కారుకు అడ్డంగా డీసీపీ డ్రైవర్ సిమెంట్ ఇటుకలు పెట్టేవాడని.. అందువల్ల ఆమె తన వాహనాన్ని బయటకు తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చేదని.. ఈ విషయం డీసీపీకి తెలియకపోవచ్చని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. డింపుల్‌పై కావాలనే తప్పుడు కేసు పెట్టారని.. దీనిపై లీగల్‌గా ఫైట్ చేస్తామని ఆమె తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు.
డింపుల్ హయతితో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పష్టం చేశారు. కొద్దిరోజులుగా డింపుల్ హయతినే తన వాహనానికి అడ్డుగా కారు పెడుతోందని తెలిపారు. పోలీసు అధికారిని కాబట్టి అత్యవసరంగా వెళ్లాల్సి ఉంటుందని.. అలాంటి సమయంలో డింపుల్ తన కారు అడ్డుగా పెట్టి ఇబ్బంది పెడుతోందని అన్నారు. తాజాగా తన వాహనాన్ని ఢీకొట్టి కాలితో తన్నిందని తెలిపారు. ఇలా చాలాసార్లు జరిగిందని ఆయన బయటపెట్టారు. ఆ సమయంలో తను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేశానని.. అయినా ఆమె తీరు మారలేదని చెప్పారు. దీంతో తన డ్రైవర్ చేతన్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. డింపుల్‌తో వ్యక్తిగతంగా తనకు ఎలాంటి వివాదాలు లేవని.. ఆమె చేసిన ఆరోపణల వెనుక నిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని తెలిపారు.
ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే అధికారిక వాహనాన్ని ఢీకొట్టిన కారు డింపుల్ హయతి స్నేహితుడైన విక్టర్ డేవిడ్ పేరు మీద ఉంది. డేంజరస్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘించడంతో ఆ కారుపై ఇప్పటికే పలు ఛలాన్లు ఉన్నాయి. గత వారం రోజుల్లోనే ఆ కారుపై రూ.3వేలకు పైగా జరిమానాలు పడటం గమనార్హం. కాగా డింపుల్ హయతి ప్రవర్తనపై అపార్ట్మెంట్ వాసులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. డింపుల్ హయతి ప్రతిరోజు తాగి అర్ధరాత్రి ఇంటికి వస్తుంటుందని ఆరోపిస్తున్నారు.
“Dimple Hayathi | ఖతర్నాక్ పోజులతో కైపెక్కిస్తున్న డింపుల్ హయతి..”