హైదరాబాద్ పరిధిలోని వెస్ట్‌జోన్ టోలిచౌకి ఆర్టీఓ కార్యాలయం దినదినం యమగండంగా మారుతున్నది. ఓల్డ్ ముంబై హైవేను ఆనుకొని ఉన్న ఆర్టీఓ కార్యాలయం ఇరుకుగా ఉండటంతో పాటు చీకటి గదులను తలపిస్తూ బూతు బంగ్లాలా దర్శనమిస్తోంది. వాహన సేవల కోసం వచ్చేవాళ్లంతా తమ వాహనాలను ప్రధాన రోడ్డుపైనే పార్కింగ్ చేయాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతున్నది. ఇదిలా ఉండగా ఈ కార్యాలయానికి మైదానం లేకపోవడంతో వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రతి రోజు సాహసోపేతమని చెప్పాలి. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వాహనదారులు తొలుత ఎడమ వైపున ఉన్న కార్యాలయం ఎదుట రోడ్డుపై వాహనాలను నిలిపి.. కార్యాలయంలో ఫొటో, డిజిటల్ సంతకం ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
అనంతరం కొంత దూరం ప్రయాణించి యూటర్న్ తీసుకుని మళ్లీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఓ చెట్టుకింద అంటే ప్రధాన రోడ్డు మార్గంపై వాహనాలను ఆపాలి. ఆ రోడ్డు గుండా ఇతర వాహనాలు వందల సంఖ్యలో నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన కార్ల రిజిస్ట్రేషన్ కోసం వచ్చి రోడ్డుపై నిలుపడంతో వెనుకాల నుంచి వేగంగా వచ్చే వాహనాలు ఒక్కసారిగా నియంత్రణ కాకపోవడంతో కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. ఇటీవల రెండు కొత్త కార్లు ప్రమాదానికి గురయ్యాయని వాహనదారులు నమస్తే తెలంగాణతో చెప్పారు. ఏదైనా భారీ వాహనం వేగాన్ని నియంత్రించలేకపోతే రోడ్డుపై ఉన్న కొత్త వాహనాలు, వాహనదారులకు ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న టోలిచౌకి కార్యాలయానికి ప్రభుత్వం మైదానంతో కూడిన భవనం నిర్మించాల్సిన అవసరం ఉన్నదని వాహనదారులు పేర్కొన్నారు.
కనీస పార్కింగ్ సదుపాయం కూడా లేకపోవడంతో వాహనాలను రోడ్లపైనే ఆపాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇదే అదునుగా భావించి ట్రాఫిక్ పోలీసులు ఆగి ఉన్న వాహనాల ఫొటోలు తీసి చలాన్లు పంపిస్తున్నారని ప్రకాశ్ అనే వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు నిలుపడానికి టోలిచౌకిలో పార్కింగ్ స్థలం లేదని, ఎక్కడ వాహనాలను నిలుపాలని ప్రశ్నించారు. పై పెచ్చు కార్యాలయంలో ప్రమాదకరంగా విద్యుత్ లైన్లతో కూడిన పెద్ద ట్రాన్స్ఫార్మర్ కూడా ఉన్నదని చెప్పారు. ప్రభుత్వం స్పందించి టోలిచౌకి కార్యాలయాన్ని మరో ప్రాంతానికి తరలించాలని కోరారు.
వసతులు లేక వెస్ట్‌జోన్ టోలీచౌకి ఆర్టీవో కార్యాలయానికి వచ్చే వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనంలో కొనసాగుతున్న ఈ కార్యాలయానికి పార్కింగ్, మైదానం, సరైన వసతులు లేవు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జాం అవుతున్నది. దీంతో నిత్యం ప్రధాన రోడ్డుపై వెళ్లే వాహనదారులకు, ఇటు కార్యాలయానికి వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా మైదానంతో కూడిన నూతన భవనం నిర్మించాలని అధికారులు, వాహనదారులు కోరుతున్నారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ)