మియాపూర్, ఆగస్టు 12: ఆ యువ దంపతుల కల్యాణ వేడుక ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహంలేదు. తమ వివాహం పర్యావరణహితంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు, ప్లాస్టిక్ కవర్లలో బహుమతులు, ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనాలు సర్వ సాధారణం అయ్యాయి. కానీ ఈ కాబోయే యువజంట వివాహ వేడుకలలో అవేవి కనిపించవు. నగరంలో ఇదే తరహా చేసేందుకు బల్దియా, సామాజిక సంఘాలు పాటుపడుతున్న నేపథ్యంలో ఆ బల్దియా అధికారి తన కుమారుడి వివాహ వేడుకలను ఇలా భిన్నమైన రీతిలో పర్యావరణ హితంగా చేయాలని భావించారు.
రీసైకిల్డ్ పేపర్లతో ఆహ్వాన పత్రిక
నగరంలోని శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్‌గా పని చేస్తున్న కొడిచర్ల ప్రశాంతి, రవిప్రకాశ్ దంపతుల ద్వితీయ కుమారుడు ఇన్వెస్టిమెంట్ బ్యాంకింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన కొడిచర్ల మాధవన్, అదే కోర్సును పూర్తి చేసిన జాలిగామ దీక్షిత వివాహ వేడుక ఈనెల 14వ తేదీన నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో జరుగనున్నది. ఈ వివాహానికి ఆహ్వానితులైన బంధు మిత్రులు, శ్రేయోభిలాషులను ఆహ్వానించేందుకు రూపొందించిన వివాహ పత్రికను పాత వస్ర్తాలు, రీసైకిల్డ్ పేపర్లతో తయారు చేశారు.
ఇలా సుమారు 300 లకు పైగా ఈ తరహా రీసైకిల్డ్ వ్యర్థాలతో తయారు చేసిన ఆహ్వాన పత్రికలను అందించారు. వధూవరుల పేర్లు, వివాహ వేడుకల వివరాలతో పాటు పత్రిక చివరలో .. పర్యావరణ హితంగా రీసైకిల్డ్ పేపర్లు, వస్ర్తాలతో తయారు చేసిన పత్రికగా అందులో ప్రత్యేకంగా అచ్చువేయించారు.ఈపత్రికతోపాటు మరో ఆహ్వాన పత్రికను ముద్రించారు. తద్వారా పత్రిక ద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని కలుగని విషయాన్ని మరోపక్క రీసైకిల్డ్ వనరుల వినియోగాన్ని వేడుకలను నిర్వహించుకోబోయే వారికి ప్రత్యక్షంగా ప్రచారం చేశారు.
పర్యావరణ హితంగా కుమారుడి వివాహం
పర్యావరణ పరిరక్షణకు పాటు పడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అధికారిగా, ఓ గృహిణిగా మా కుమారుడి వివాహాన్ని చేయాలని, ప్రధానంగా ప్లాస్టిక్ కవర్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను వివాహంలో వినియోగించకుండా చూడాలని మా కుటుంబమంతా నిర్ణయించాం. ప్రత్యామ్నాయంగా బంధుమిత్రాదులకు గుడ్డ సంచులు ఏర్పాట్లు చేశాం. భోజనాలకు స్టీలు ప్లేట్లను, తాగేందుకు స్టీలు గ్లాసులనే వినియోగిస్తాం. వేదిక అలంకరణలోనూ ఒక్క ప్లాస్టిక్ పువ్వులు వాడటంలేదు. సహజ ఎరువుల తయారీకి ఏర్పాట్లు, మిగిలిన భోజన పదార్థాలను అనాథలకు, చారిటీలకు అందిస్తాం.
-కొడిచర్ల ప్రశాంతి, ఉపకమిషనర్, శేరిలింగంపల్లి సర్కిల్