సిటీబ్యూరో, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): నకిలీ ఆయుధ లైసెన్స్ కలిగిన వ్యక్తులను ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు ఉద్యోగంలోకి చేర్చుకోవద్దని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. బుధవారం కమిషనరేట్లో ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ పాల్గొని నిర్వాహకులకు పలు ఆదేశాలు, హెచ్చరికలు జారీచేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. లైసెన్స్ లేకుండా ఏజెన్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీల పర్యవేక్షణకు ప్రత్యేకంగా అదనపు డీసీపీ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 సెక్యూరిటీ ఏజెన్సీలతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.