సిటీ బ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ): దేశంలోని మఠాలు, పీఠాలు ప్రజల్లోకి వచ్చి సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడాలని అశ్విని ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ అన్నారు. సనాతన ధర్మ వైభవం, ఇతర ధార్మిక కార్యక్రమాలపై భవిష్యత్ కార్యాచరణకు తన అభిప్రాయాలు, సూచనలు తెలపడానికి ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వ్యాకరణం నాగేశ్వర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన ఓ జాతీయ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుంభమేళా ఏర్పాట్లు, అక్కడి పరిస్థితులపై మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలకు దేశంలోని వివిధ శంకారాచార్య మఠాధిపతులు స్పందించారు.
నాగేశ్వర్‌ను సలహాలు, సూచనలు ఇవ్వడానికి రావాలని జ్యోతిర్మట్ శంకరాచార్య శ్రీ అవి ముక్తేశ్వరానందస్వామి జ్యోతిష్ పీఠం ఆహ్వానించింది. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ… సుమారు 35 కోట్ల మంది సనాతన ధర్మాన్ని ఆచరించేవారు హాజరవుతున్న కుంభమేళాలో సేవలు చేయడానికి శంకరాచార్య పీఠంవారు ముందుకు రావాలని సూచించారు. కుంభమేళాకు రాలేని స్థితిలో ఉన్న 75 శాతం మందికి త్రివేణి సంగమ నీటిని పంపించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. పవిత్రమైన నీరు అందరికీ అందేవిధంగా నాలుగు శంకరాచార్య పీఠాలు బాధ్యత తీసుకోవాలని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షులైన శంకరాచార్య పీఠాధిపతులు స్పందించకుంటే భక్తులు నిరాశ చెందే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మిక, లౌకిక, దైవిక విషయాలు, ధర్మ బోధన కార్యక్రమాలపై, పవిత్ర యజ్ఞాలపై శంకరాచార్య మఠాలు చూపుతున్న శ్రద్ధ గొప్పదని కొనియాడారు. అదేవిధంగా సనాతన ధర్మ రక్షణకు ముందుకు రావాల్సిన బాధ్యత మఠాలపై ఉందని అన్నారు.