తెలుగు యూనివర్సిటీ, మే 25. ఉత్తమ సమాజ నిర్మాణానికి బాల సాహిత్యం ఎంతో దోహదపడుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. అబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో శాంతా-వసంతా ట్రస్టు సౌజన్యంతో ఆదివారం కోడూరు శాంతమ్మ స్మారక బాల సాహిత్య సమ్మేళనం సందడిగా కొనసాగింది. సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరైన శాంతా వసంతా ట్రస్టు అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి ప్రసంగిస్తూ తన తల్లి చెప్పిన కథలే తన జీవితాన్ని ప్రభావితం చేశాయన్నారు.
భాషపైన అభిమానంసాహిత్యాభిరుచి అలవరచుకుంటే ఉత్తమ రచయితలుగా, ఉత్తమ పౌరులుగా తయారయ్యేందుకు దోహదపడతాయని అన్నారు. బాల సాహితీవేత్తలు గరిపెల్లి అశోక్, డాక్టర్ పత్తిపాక మోహన్, డాక్టర్ వీఆర్ శర్మ, చొక్కాపు వెంకటరమణ, డాక్టర్ దాసరి వెంకట రమణ, డాక్టర్ అమరవాది నీరజ, చంద్ర శేఖర అజాద్, డి కె చదువుల బాబుతో పాటు ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన 150 మంది ప్రతినిధులు, 65 మంది వక్తలు పాల్గొని బాల సాహిత్యంలో రావలసిన మార్పులపై విస్తృత చర్చ జరిగింది. ఈ సందర్భంగా బాల సాహిత్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న ఉభయ తెలుగు రాష్ర్టాలకు చెందిన బాల సాహితీవేత్తలకు, ఉపాధ్యాయులకుఒక్కొక్కరికి రూ2,500 నగదు, శాలువా, జ్ఞాపికతో వరప్రసాద్ రెడ్డి ఘనంగా సత్కరించారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ చెన్నయ్య సదస్సును సమన్వయం చేశారు.