Allu Arjun | అల్లు అర్జున్ను అరెస్టు చేసిన సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారనే వార్తలపై సెంట్రల్ జోన్ డీసీపీ స్పందించారు. అరెస్టు చేసిన సమయంలో అల్లు అర్జున్ పట్ల దురుసుగా ప్రవర్తించలేదని స్పష్టం చేశారు.
సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట కేసులో అరెస్టు చేసేందుకు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన పోలీసులు.. దుస్తులు మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని వస్తున్న వార్తలు అవాస్తవమని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. దుస్తులు మార్చుకుంటానంటే సమయమిచ్చామని స్పష్టం చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు కూడా సమయమిచ్చామని అన్నారు. అతను బయటకు వచ్చాకే అదుపులోకి తీసుకున్నామని వివరించారు. తానే స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో కూర్చున్నారని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ అరెస్టు విషయంలో గురువారం మధ్యాహ్నం నుంచి హైడ్రామా కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేసి నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచారు. అక్కడ ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ తరఫున న్యాయవాది హైకోర్టును ఆశ్రయించడంతో నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.50వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.