గుక్కెడు నీటి కోసం సిటీ జనం అల్లాడిపోతున్నారు. ఏ కాలనీ చూసినా.. ఏ బస్తీ చూసినా.. ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. మళ్లీ ఉమ్మడి పాలనలోని తాగునీటి కష్టాలు పునరావృతమయ్యాయి.. రోజుల తరబడి నీళ్లందక కొన్ని ప్రాంతాలు.. లో ప్రెషర్ కష్టాలు.. కలుషిత నీటి సరఫరాతో మరిన్ని ప్రాంతాలు.. ఇలా మండుటెండలో ప్రజలు తాగునీటికి అవస్థలుపడుతున్నారు. సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతూ..నగరవ్యాప్తంగా ధర్నాలు.. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అటు భూగర్భ జలాలు పూర్తిగా పాతాళానికి వెళ్లాయి.. ఫలితంగా ఇండ్లలోని బోర్లు సైతం అడుగంటి పోతున్నాయి. ట్యాంకర్లు బుక్ చేసుకుంటే ఇండ్లకు చేరేందుకు మూడు, నాలుగు రోజులు పడుతున్నది. దీంతో ఆగ్రహిస్తున్న నగర ప్రజలు రోడ్డెక్కుతున్నారు. జలమండలి కార్యాలయాలకు ఖాళీ బిందెలతో దండెత్తుతున్నారు. నగర ప్రజల నీటి కష్టాలను చూసి బీఆర్ఎస్ శ్రేణులు వారి నిరసనలకు మద్దతు తెలుపుతున్నారు. శనివారం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో ఖైరతాబాద్ జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. ఇదేనా ప్రజా పాలన అంటూ.. వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. తీవ్ర స్థాయిలో సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఇతర ప్రాంతాల్లో సైతం తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ..ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. పదేండ్లలో నగర ప్రజలకు నీటి ఇబ్బందులు రాలేదని బీఆర్ఎస్ పాలనను నగరవాసులు గుర్తు చేసుకున్నారు.

సిటీ బ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): భాగ్యనగరంలో ప్రజలు తాగునీటి కోసం యుద్ధం చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. గుక్కెడు నీటి కోసం నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు దిగాల్సి వస్తున్నది. మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కుతున్నారు. ఏ కాలనీ చూసినా.. ఏ బస్తీ చూసినా తాగునీరు సరఫరా కావడం లేదని నిరసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని జలమండలి రిజర్వాయర్లు, కార్యాలయాల ముందు ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. రోజుల తరబడిగా తాగునీరందక కొన్ని ప్రాంతాలు.. లో ప్రెషర్ కలుషిత నీటి సరఫరాతో మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలు అల్లాడిపోతున్నారు. తాగునీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలోని జలమండలి అధికారుల నిర్లక్ష్యం వల్ల నెలనెలా నీటి పన్నులు చెల్లిస్తున్న వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
తమ సమస్యలను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో అన్ని ప్రాంతాల్లో బిందెలు, ప్లకార్డులతో రోడ్డు పైకి వచ్చి తమ సమస్యను నిరసనలు, ఆందోళనల రూపంలో చెబుతున్నారు. మునుపెన్నడూ లేనంతగా ఈ వేసవిలో నీటి సమస్య తాండవిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. నీటి సరఫరా లేకపోవడంతో ట్యాంకర్లను ఆశ్రయించినా అవి సకాలంలో రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అటు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో ఇండ్లలోని బోర్లు సైతం అడుగంటి పోతున్నాయి. ట్యాంకర్లు బుక్ చేసుకుంటే ఇండ్లకు చేరేందుకు ముడు, నాలుగు రోజులు పడుతున్నది. దీంతో ఆగ్రహిస్తున్న నగర ప్రజలు రోడ్డెక్కుతున్నారు. ప్రజల నీటి కష్టాలను చూసి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు వారి నిరసనలకు మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. పరిష్కారం చూపేలా వారితో మాట్లాడి నీటి కష్టాలను తీర్చి అండగా నిలుస్తున్నారు. నగర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు, నాయకులు బాధితులకు బాసటగా ఉంటున్నారు.
బీఆర్ఎస్ పాలనలో నీటి సమస్య లేదు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. ఎక్కడైనా సరఫరాలో అంతరాయం, నీటి సమస్యలు ఏర్పడినా వెంటనే పరిష్కరించి నీళ్లు వచ్చేలా చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురపాలక శాఖను తన దగ్గరే ఉంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి నగర ప్రజల బాధలను పట్టించుకోవడం మానేశారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం ప్రజల బాధలను గాలికొదిలేసింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి టీడీపీ, కాంగ్రెస్ పాలనలో నగర ప్రజలు బిందెలతో రోడ్డెక్కిన రోజులను తిరిగి పునరావృతం చేస్తున్నారు.
ఎక్కడ చూసినా ఉమ్మడి ఏపీలో బిందెలతో అప్పటి ప్రతిపక్ష నేతలు ధర్నాలు, రాస్తోరోకోలు చేసిన దృశ్యాలను తిరిగి తీసుకొస్తున్నారు. అప్పటి మాదిరిగానే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు మద్దతుగా బిందెలతో రోడ్డెక్కాల్సిన దుస్థితి నేటి కాంగ్రెస్ పాలనలో తలెత్తుతున్నది. ప్రజలకు సరఫరా చేసేందుకు సరిపడా నీళ్లున్నా ప్రభుత్వం చేతకాని తనం, అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు అందని పరిస్థితులు దాపురించాయి. ఉమ్మడి పాలకులను రేవంత్‌రెడ్డి సర్కారు ప్రజలు గుర్తు చేసే పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది. మరో నెలరోజులు ఎండల తీవ్రత ఉండటంతో ప్రజలకు నీటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
ఉచిత నీటి పథకాన్ని అమలు చేయండి
జలమండలి ఎండీ అశోక్‌రెడ్డికి వినతి
బండ్లగూడ,మే 23: జీహెచ్ఎంసీ పరిధిలోకి ఇటీవల విలీనమైన కిస్మత్పూర్,హైదర్షాకోట్,బండ్లగూడ జాగీర్ తదితర ప్రాంతాలలో ఉచిత మంచినీటి పథకాన్ని అమలు చేయాలని ఆల్ కాలనీస్ ఫెడరేషన్ సభ్యులు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలైన 20వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్ని తమ డివిజన్లలో కూడా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కూడా అనేక మంది నిరుపేదలు ఉన్నారని వారి కోసం 20 వేల లీటర్ల ఉచిత మంచినీటిని పంపిణీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆల్ కాలనీ అసోసియేషన్ సభ్యులు వినయ్‌రెడ్డి,నరేందర్ బాబు,నదీమ్,విజయ్ పద్మనాభన్,రవి,రాజా తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి ఇక్కట్లు తొలగించాలి
సైదాబాద్, మే 23 : సరస్వతినగర్ డివిజన్ పరిధిలోని సింగరేణి కాలనీ గుడిసెవాసుల తాగునీటి సమస్యను పరిష్కరించాలని, ట్యాంకర్ల సంఖ్యలను పెంచాలని కోరుతూ శనివారం యాకుత్‌పురా నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌ను సైదాబాద్ డివిజన్ సీపీఐ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానికులకు అవసరమైన ట్యాంకర్ల సంఖ్యను పెంచడానికి జలమండలి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని, తాగునీటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని సైదాబాద్ డివిజన్ సీపీఐ కార్యదర్శి మహమూద్, పద్మ, లింగం నాయక్, సంతోష్, రత్న, సరస్వతి తెలిపారు.
ట్యాంకర్ డ్రైవర్ల ఆందోళన నిలిచిన నీటి సరఫరా
మియాపూర్ , మే 23 : కూకట్పల్లి జలమండలి డివిజన్ పరిధిలోని హైదర్‌నగర్ ఫిల్లింగ్ కేంద్రంలో వాటర్ ట్యాంకర్ల డ్రైవర్లు ఆందోళన చేపట్టడంతో ట్యాంకర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు సెక్షన్లకు రోజువారీగా సరఫరా కావాల్సిన వందలాది నీటి ట్యాంకర్లు నిలిచిపోయాయి. అటు కార్యాలయాలకు ఇటు ఫిల్లింగ్ కేంద్రానికి పెద్ద సంఖ్యలో బుకింగ్ దారులు చేరుకుని నీటి సరఫరా నిలిచిపోవటంపై ఆరా తీశారు. డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ సెక్షన్లో గత నెలలో ఓ వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు.దీనిపై కేపీహెచ్‌బీ ఠాణాలో కేసు నమోదైంది. విచారణ అనంతరం ఈ నెల 11 న సదరు ట్యాంకరును పోలీసులు విడుదల చేశారు. అయితే ఆ వాటర్ ట్యాంకర్ యజమాని తిరిగి నీటి సరఫరా పునరుద్ధరణకు భాగ్యనగర్ సెక్షన్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపించారు. ఈ క్రమంలో రోజులు గడుస్తున్నా ట్యాంకర్ సేవలను పునరుద్ధరించేందుకు అధికారులు అంగీకరించకపోవటంతో ఇక్కడి హైదర్‌నగర్ ఫిల్లింగ్ కేంద్రం వద్ద ట్యాంకర్ యజమానుల సంఘం ఆధ్వర్యంలో యజమానులు, డ్రైవర్లు శనివారం ఉదయం 7 గంటలకు ట్యాంకర్లు నిలిపేసి ఆందోళనకు దిగారు. దీంతో రోజువారి బుకింగ్‌లకు వందలాది ట్యాంకర్ల నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజల నుంచి తీవ్రమైన ఒత్తిడి నెలకొనటంతో ఉన్నతాధికారులు హుటాహుటిన ఫిల్లింగ్ కేంద్రానికి చేరుకుని నిలిపేసిన ట్యాంకర్ సేవల పునరుద్ధరణకు అంగీకరించడంతో తమ ఆందోళనను విమరించారు. ఘటనపై భాగ్యనగర్ సెక్షన్ మేనేజర్ విలియం ప్రకాష్‌ను వివరణ కోరగా వాటర్ ట్యాంకర్ ప్రమాదం నేపథ్యంలో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా చూసుకునేందుకు ఉన్నతాధికారులకు విషయాన్ని నివేదించి వారి అనుమతి కోసం ఎదురుచూడటంలో కొంత ఆలస్యమైందన్నారు. ఆ ట్యాంకర్‌కు అనుమతి ఇవ్వటంతో పాటు యజమానులకు నచ్చచెప్పి వాటర్ ట్యాంకర్ల సరఫరాను
పునరుద్ధరించామన్నారు.
నీటి సమస్య పరిష్కరించకపోతే తిరుగుబాటు తప్పదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రేటర్ వ్యాప్తంగా ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రాష్ర్టానికి రోజుకు 750 ఎంఎల్డీల నీటి అవసరం ఉన్నా.. కేవలం 550 ఎంఎల్‌డీలే సరఫరా చేస్తున్నారు. రోజుకు 12 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే నీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతున్నది. ప్రజలు పలు రకాలుగా మొరపెట్టుకున్నా, ఫిర్యాదులు చేసినా.. ప్రభుత్వం స్పందించడం లేదు. తాగు నీటి సమస్య వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం. నీటి సరఫరా మెరుగు పర్చకపోతే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారు.
-ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి