వెంగళరావునగర్, సెప్టెంబర్ 25 : కట్టుకున్న భార్యను కడతేర్చాడు. కన్న బిడ్డల్ని అమ్మకానికి పెట్టాడు. భార్యది సహజ మరణంగా నమ్మబలికిన తండ్రి దుర్మార్గాన్ని పదమూడేళ్ల కుమార్తె బయటపెట్టడంతో బంధువులు, పోలీసులు హతాశులయ్యారు. “అమ్మను నాన్నే చంపాడు.. నాన్నను చూస్తే భయమేస్తున్నది.. నాన్న దగ్గరికి వెళ్లను.. నాన్న బారి నుంచి నాతో పాటు, 3 నెలల చెల్లిని కాపాడాలంటూ” ఆ బాలిక ఎంబీటీ నాయకుడు అంజాదుల్లాఖాన్తో కలిసి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన షేక్ సలీమ్ (40) జవహర్‌నగర్‌లోని మసీదుగడ్డలో స్థిరపడ్డాడు. సలీమ్‌కు కామారెడ్డికి చెందిన ఫర్జానా (38)తో 20 ఏండ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు 13 ఏండ్లు, మూడు నెలల వయసున్న ఇద్దరు కుమార్తెలున్నారు. దినసరి కూలీ పనులు చేసుకుని జీవించే సలీమ్.. జూన్ 14వ తేదీ రాత్రి భార్య ఫర్జానాతో గొడవపెట్టుకున్నాడు. ఆవేశానికి లోనైన అతడు భార్య తలపై పప్పుగుత్తితో కొట్టి చంపాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక పేర్కొంది.
వెంగళరావునగర్‌లో ఉండే బంధువు అన్వర్ఖాన్కు ఫోన్ చేసి.. తన భార్య ఫర్జానా ఫిట్స్ వచ్చి సహజ మరణం చెందిందని.. మృతదేహాన్ని కామారెడ్డికి తీసుకెళ్లడానికి రూ.14వేలు కావాలని అడిగి తీసుకున్నాడు. హైదరాబాద్ నుంచి అంబులెన్స్‌లో భార్య మృతదేహంతో బిడ్డల్ని కూడా తీసుకుని కామారెడ్డిలోని మృతురాలి చెల్లి ఇంటికి వెళ్లాడు. భార్యది సహజ మరణంగానే బంధువులను నమ్మించాడు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల సలీమ్ మరో పెళ్లి చేసుకున్నాడు. 13 ఏండ్ల పెద్ద కుమార్తె, మూడు నెలల చిన్న కూతురిని అమ్మడానికి ప్రయత్నాలు చేయసాగాడు. ఈ విషయాన్ని గుర్తించి పెద్ద కుమార్తె పిన్నితో చెప్పగా.. అక్కను చంపి.. అక్క బిడ్డల్ని కూడా అమ్మడానికి బావ ప్రయత్నిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న ఆమె.. హైదరాబాద్ వెంగళరావునగర్‌లో నివాసముండే బంధువు అన్వర్‌ఖాన్ ఇంట్లో పిల్లల్ని దాచిపెట్టింది. ఈ విషయాన్ని ఎంబీటీ నాయకుడు అంజాదుల్లాఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎంబీటీ నేత అంజాదుల్లాఖాన్, బంధువులతో కలిసి సోమవారం ఆ బాలిక మధురానగర్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. తండ్రి కిరాతకంపై పెద్ద కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.