వారంతా డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు. పిల్లలు చదువులు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం సొంత జిల్లాలో హైదరాబాద్‌కు వచ్చినవారు. కానీ ఇప్పుడు ఆ ఉద్యోగులే హెచ్ఎండీఏ ఉద్యోగులకు కొరకరాని కొయ్యలుగా మారుతున్నారు. కీలక బాధ్యతలను దక్కించుకొని శాశ్వత ఉద్యోగుల అవకాశాలను లాగేసుకుంటున్నారు. దీంతో తమకున్న అనుభవం దృష్ట్యా రావాల్సిన పదవులను శాశ్వత ఉద్యోగులు పొందలేకపోతున్నారు. కీలక విభాగాలను తమ ఆధీనంలో పెట్టుకొని డిప్యూటేషన్ ఉద్యోగులు చేస్తున్న కార్యకలాపాలతో విసిగిపోతున్నారు. దీంతో హెచ్ఎండీఏ ఉద్యోగుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తున్నాయి.
– సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)
HMDA | ఏడు జిల్లాలకు విస్తరించిన హెచ్ఎండీఏ కార్యాలయం ఉద్యోగుల వర్గ పోరుకు కేంద్రంగా మారింది. డిప్యుటేషన్ వర్సెస్ శాశ్వత ఉద్యోగులు అన్నట్లు పరిస్థితులు మారుతున్నాయి. ఉద్యోగులపై జరుగుతున్న ఆధిపత్యం పోరుతో వివాదాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు కీలక పదవుల్లో ఉండటమే విభేదాలు కారణమవుతున్నది. నిబంధనల ప్రకారం సీనియారిటీ ద్వారా పొందాల్సిన అవకాశాలను శాశ్వత ఉద్యోగులు కోల్పోవడం కూడా అసహనానికి కారణం అవుతుంది. ఇక డిప్యూటేషన్ వచ్చిన ఉద్యోగులు కీలక విభాగాలలోకి ఉంటూ శాశ్వత సిబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అర్బన్ ఫారెస్ట్, బీబీపీ, హెచ్‌జీసీఎల్, ప్లానింగ్ వంటి ప్రధాన విభాగాల్లో డిప్యుటేషన్ ఉద్యోగులదే హవా కొనసాగుతున్నది. ఇతర శాఖల నుంచి వచ్చిన ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ , ఆయా సెక్షన్లలో శాశ్వత ఉద్యోగులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. శాశ్వత ఉద్యోగులను ఇతర సెక్షన్లకు బదిలీ చేసి, ఆ స్థానంలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానంలో వచ్చిన సిబ్బందిని నియమించుకుంటున్నారు. దీంతో జరిగే కీలక కార్యకాలాపాలన్నీ డిప్యుటేషన్, అవుట్ సోర్సింగ్ జరుగుతున్నాయి. అర్బన్ ఫారెస్ట్ విభాగంలో డిప్యుటేషన్ పై వచ్చిన ఓ అధికారి ఆరేండ్లుగా కొనసాగుతున్నారు. ఆ అధికారి ఆడిందే ఆటగా వ్యవహారాలు సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ హరితహారంలోనూ సదరు అధికారి చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలున్నాయి. ఇక ప్లానింగ్ విభాగంలో డీటీసీపీ, జీహెచ్ఎంసీ వంటి విభాగాల నుంచి వచ్చినవారు ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఇలా ప్రతి విభాగంలో డిప్యుటేషన్ ఉద్యోగులు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ తమని మానసికంగా వేధిస్తున్నారని..తమకు రావాల్సిన ప్రయోజనాలకు గండి కొడుతున్నారని శాశ్వత ఉద్యోగులు వాపోతున్నారు.