హైదరాబాద్ : మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సనత్‌నగర్ జెక్కాలనీలో వక్ఫ్‌బోర్డుకు చెందిన భూమిని శనివారం ఆ బోర్డు సీఈవో షహనవాజ్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంత, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాలనీకి ఒక క్రీడాస్థలం కోసం 2017 సంవత్సరంలో ప్రభుత్వం 2,500 గజాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని లీజుకు కేటాయించిందని, కానీ కోర్టు కేసులతో నేటి వరకు ఆ స్థలాన్ని తమకు అప్పగించలేదని జెక్ కాలనీ ప్రతినిధులు వివరించారు.
ఈ విషయాన్ని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి పలుసార్లు తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మున్సిపల్ శాఖ మంత్రితో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించారు. దీంతో కేటీఆర్ ఆదేశాల మేరకు వక్ఫ్ బోర్డు స్థలాన్ని అధికారులు సందర్శించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జెక్ కాలనీ ప్రతినిధులు సూర్య శంకర్ రెడ్డి, సురేష్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఉన్నారు.