‘ఒక్క జత యూనిఫాం ఇచ్చి విద్యా శాఖ అధికారులు చేతులు దులుపుకొన్నారు. ప్రతీ రోజు యూనిఫాం వేసుకోవాలని చెబుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు ఉతుక్కుంటేగానీ ఆ మరుసటి రోజు యూనిఫాం వేసుకోలేని పరిస్థితి. స్కూల్ అయిపోగానే ఇంటికెళ్లి హోం వర్క్‌కు బదులు ముందుగా యూనిఫాం ఉతుక్కుంటున్నాం. బట్టలు కూడా ఇచ్చే స్థోమత ఈ ప్రభుత్వానికి లేదా?’ అంటూ ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన సౌమ్య అనే విద్యార్థిని ప్రశ్నించింది.
సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ అధికారులకు ముందుచూపు లేకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో సకాలంలో అందాల్సిన రెండు జతల దుస్తులు అందలేదు. ఒక్క జత దుస్తులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. గత ఏడాది మూడు నెలలైనా యూనిఫాంలు ఇవ్వలేక నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులు.. ఈ ఏడాది కూడా అదే బాట పట్టడం విమర్శలకు తావిసున్నది.
ఈ సారి యూడైస్ లెక్కల ప్రకారం హైదరాబాద్‌లో 1,03,912 మంది విద్యార్థులకు యూనిఫాంలు రెండు జతల చొప్పున అందించాల్సి ఉంది. కానీ ఒక్క జత దుస్తులే అందించారు. అందులోనూ కొన్ని చోట్లు దుస్తులు అందలేదనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రెండో జత దుస్తులకు సంబంధించిన క్లాత్ చాలా ఆలస్యంగా వచ్చిందని అధికారులు చెబుతున్నారు. జూన్ 17, 18న పాఠశాల హెచ్ఎంలకు చేరిందని అధికారులు పేర్కొన్నారు.
వీటిని సంబంధిత మహిళా సంఘాలకు అందించాల్సి ఉంది. వాళ్లు ఈ దుస్తులను విద్యార్థుల సైజుల ఆధారంగా కుట్టాల్సి ఉంది. అయితే ఒక్క జత యూనిఫాం కుడితే రూ.75 చెల్లిస్తున్నారు. రెండు జతలు కుడితే రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. గతంలోనూ యూనిఫాం బకాయిలు సకాలంలో చెల్లించలేకపోవడంతో చాలా మంది మహిళా సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా మొదటి జత దుస్తుల బకాయిలు ఇంకా చెల్లించలేదని కొందరు చెబుతున్నారు. ఇదే సమయంలో రెండో జత దుస్తులు కూడా కుట్టాలని రావడంతో వాళ్లు డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకింత నిర్లక్ష్యం..
మొదటి జత యూనిఫాంలకు సంబంధించి సుమారు రూ.77లక్షల రూపాయలు మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. రెండో జత ప్రక్రియ పూర్తయితే మొత్తం కోటి యాభై లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే గతంలో మహిళ సంఘాలకు దుస్తుల స్టిచింగ్ ప్రక్రియ అందించక ముందర సంబంధిత పాఠశాల హెచ్ఎంలు టైలరింగ్ వాళ్లకు అందించి స్టిచింగ్ చేయించేవారు. ఈ సారి క్లాత్‌ను ఇవ్వడం ఆలస్యం చేయడంతో స్టిచింగ్ ప్రక్రియ కూడా ఆలస్యమవుతున్నదని చెబుతున్నారు.
అంతేకాదు విద్యార్థుల దుస్తుల కొలతలు తీసుకోలేకపోయారు. దీంతో వాళ్లు ఊహాజనిత ఆధారంగా తరగతుల వారీగా దుస్తులు కుట్టేస్తున్నారు. 1,2,3 తరగతులకు ఒక సైజు అని, 4,5కు, 6,7కు, 8,9,10 తరతగతులకు ఓ సైజు అని దుస్తులను కుడుతున్నారు. అయితే క్లాస్‌లో కొందరు బొద్దుగా, మరికొందరు సన్నగా ఇంకొందరు పొడువు, పొట్టిగా ఉంటారు. ఆ దుస్తులు సరిగా కుదరడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లొడాస్ ప్యాంటు, షర్టుల్లో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు ఒక జత దుస్తులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు.