సిటీబ్యూరో/బంజారాహిల్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): నిబంధనలకు పాతరేసి అక్రమార్కులకు అసరాగా నిలుస్తున్నట్లు ఉంది బల్దియా తీరు. ప్రాజెక్టు చిన్నదైన, పెద్దదైనా తమ అస్మదీయులకు పనులు కట్టబెబుతూ వారికి దాసోహమవుతున్నది. అంతటితో ఆగకుండా టెండర్ నిబంధనలు ఉల్లంఘించిన ఏజెన్సీలపై చర్యలు తీసుకోకుండా వారితో అంటగాగుతున్నది.
టెండర్ వ్యవహారం నుంచి.. నిర్మాణ సమయంలోనూ అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏజెన్సీలపై తీరుపై బల్దియా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో చర్చనీయాంశంగా మారింది. నగరం నడిబొడ్డున కేబీఆర్ పార్కు వద్ద మల్టీ లెవల్ కారు పార్కింగ్ ప్రాజెక్టు అక్రమాలపై జీహెచ్ఎంసీ ప్రకటన విభాగం తీరు వివాదస్పదమవుతున్నది.
ఆది నుంచీ అడ్డదారిలోనే..
గ్రేటర్లో 8 చోట్ల మల్టీలెవల్ కారు పార్కింగ్లు చేపట్టాలని, పైలెట్ ప్రాజెక్టుగా కేబీఆర్ పార్కు గేట్ -1 వద్ద మల్టీలెవల్ స్మార్ట్ (మెకనైజ్డ్) కార్ అండ్ మోటారు సైకిల్ పార్కింగ్ ప్రాజెక్టు పనులను డీబీఎఫ్ఓటీ పద్దతిలో వెంటనే చేపట్టాలని జీహెచ్ఎంసీని ఆదేశిస్తూ గతేడాది మార్చి 14న ప్రభుత్వం జీవో నం 143ను జారీ చేసింది. ఐతే ఈ జీవో వెలువడకముందే జీవో నం 68 నుంచి ఈ ప్రాజెక్టు మినహాయింపు పొందుతూ ప్రత్యేకంగా అప్పటి పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రాజెక్టు కింద 15 ఫీట్ల కంటే ఎత్తులో ఎల్ఈడీ స్క్రీన్ (ప్రకటన బోర్డు)కు అనుమతి లభించింది. ఒకరిద్దరి కోసమో అన్నట్లుగా ప్రభుత్వం జీవో 68 నుంచి సడలింపు ఇచ్చిన తీరుపై మిగతా ఎజెన్సీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ అంశం విచారణలో ఉంది. ఇక టెండర్ ప్రక్రియకు వచ్చే సరికి గతేడాది జూన్ 7వ తేదీన టెండర్ నోటిఫికేషన్ పిలిచి 15వ తేదీన తుది గడువు(రెఫరెన్స్ డాక్యుమెంట్ నం 5/సీటీఓ)తో టెండర్‌ను ముగించారు.
ఈ క్రమంలోనే నవనిర్మాణ్ అసోసియేట్ సంస్థకు రూ. 28.23 లక్షలకు టెండర్ వేయగా..మెగా ఫ్యాబ్రికేటర్ రూ.18 లక్షలకు టెండర్ వేశారు. మూడవ బిడ్డర్ రోషన్ కంపెనీ క్వాలిఫై కాలేదు. దీంతో మొదటి బిడ్డర్ నవనిర్మాణ్ అసోసియేట్ సంస్థకు కేబీఆర్ పార్కు మొదటి గేటు వద్ద స్మార్ట్ మెకనైజ్డ్ కార్, వెహికల్ పార్కింగ్ ప్రాజెక్టు పనులు అప్పగించారు. ఈ టెండర్‌పై ఆసక్తి ఉన్న వారు చాలామంది ఉన్నా ఎవరూ పాల్గొనకుండా పలుకుబడి కలిగిన వ్యక్తులకే కట్టబెట్టారన్న విమర్శలు వినిపించాయి.
అంతేకాకుండా తొలుత పదేళ్లపాటు, ఆపై ఫలితాలను బట్టి మరో ఐదేళ్ల పాటు కొనసాగేలా లబ్ధి చేకూర్చారంటూ వ్యతిరేకత వ్యక్తమైంది. సదరు ఎజెన్సీకి 70 కార్లకు పార్కింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు చేపట్టగా..ప్రకటనలు, ఇతర కేఫెటేరియా రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకుని.సంవత్సరానికి రూ. 28 లక్షల చొప్పున జీహెచ్ఎంసీకి చెల్లించేలా టెండర్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
శంకుస్థాపన కాకుండానే ప్రకటనల దందా..
టెండర్ దక్కించుకున్న తీరు, జీవో 68 నుంచి మినహాయింపు వ్యవహారం అటుంచితే జీహెచ్ఎంసీకి సంబంధించి ఏదైన ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టినప్పుడు కచ్చితంగా టెండర్ నిబంధనలు పాటించాలి. కానీ చాలా సందర్భాల్లో టెండర్ నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు 500 గజాలలో చేపట్టాల్సి ఉండగా.. ప్రస్తుతం అనధికారికంగా కోట్లాది రూపాయల విలువైన 1000 గజాల జీహెచ్ఎంసీ స్థలాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
కేబీఆర్ పార్కు బయటనున్న స్థలంలోకి మూడడుగులు చొచ్చుకువచ్చి ప్రహరీ నిర్మాణం చేస్తున్నారు. అధికారికంగా మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ ప్రారంభం కాకముందే కాసులకు కక్కుర్తి పడిన నవనిర్మాణ్ అసోయేట్స్ నిర్వాహకులు భారీ సైజులోని డిజిటల్ ప్రకటన బోర్డుపై ప్రకటన దందాకు తెరలేపారు. లక్షలాది రూపాయలను తీసుకుంటూ రెండునెలలుగా డిజిటల్ ప్రకటనలు ప్రదర్శిస్తున్నారు. జీహెచ్ఎంసీ అనుమతి లేకుండానే ప్రకటనలను వేస్తుండటం పట్ల పలువురి ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది.
ప్రాజెక్టు పూర్తి కాకముందే చేస్తున్న ప్రకటనలను నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై నిర్వాహకులు.. ప్రాజెక్టు పూర్తి చేసుకుందని, వాకర్లకు ఉచితంగా కారు పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు నోటీసుకు రిైప్లె ఇవ్వగా.. గుడ్డి దర్బార్లా అధికారులు ఎజెన్సీపై చర్యలు తీసుకోకుండా నేటికీ ప్రకటనలు చేసుకునేలా అనధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో ఎజెన్సీ పక్షాన అన్నీ తానై అండగా నిలుస్తున్నట్లు ఓ జోనల్ కమిషనర్‌పై అరోపణలు ఉన్నాయి.
ఉన్నతస్థాయిలో పరిచయాలను అడ్డుపెట్టుకుని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తూ ప్రకటన ఆదాయాన్ని గడిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థలంలో ఉన్న ఈవీ చార్జింగ్ పాయింట్‌ను ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. జీహెచ్ఎంసీ అధికారులను తప్పుదోవ పట్టిస్తూ ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తున్నా ప్రశ్నించేందుకు అధికారులు ఇష్టపడకపోవడం వెనుక ప్రభుత్వంలో కొందరు కీలక పెద్దల మద్దతే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారికంగా ప్రారంభోత్సవం చేసిన తర్వాతనే డిజిటల్ ప్రకటనలు వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్దంగా ప్రకటనల బోర్డు..
వాస్తవంగా టెండర్ నిబంధనల ప్రకారం నిర్మాణం పైభాగానే ఎల్ఈడీ స్క్రీన్కు అనుమతి ఉంది. కానీ సదరు ఏజెన్సీ ప్రత్యేకంగా యూనిఫోల్ వేసి కమర్షియల్ హోర్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాకుండా ఎల్ఈడీ స్క్రీన్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ వీడియో యాడ్‌కు అవకాశం లేదు…అయితే ఇక్కడ మాత్రం 10 నిమిషాలకొకసారి యాడ్ వేస్తున్నారు.
ఈ నిర్వాహకుల ఆగడాలు అంతా ఇంతా కాదు…కొందరు మంత్రుల ప్రమేయంతో బిల్డర్లపై ఒత్తిడి పెంచుతున్నారనే విమర్శలున్నాయి.. రియల్ ఎస్టేట్ కంపెనీల యాడ్స్ అన్నీ ఎయిర్‌పోర్టు రోడ్డు, కేబీఆర్‌పార్కు వద్ద ఉన్న ఎల్ఈడీ స్క్రీన్లలోనే ఇవ్వాలని ఏజెన్సీ బలవంతంగా చేస్తుండటం, బాచుపల్లిలో ఓ బిల్డర్‌కు.. తనకు ఇష్టం లేకపోయినా తన కంపెనీ యాడ్‌ను ఈ ఏజెన్సీకి సమర్పించుకోవడం పట్ల రియల్ ఎస్టేట్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది.
ఈ విషయంలో రూ.40 లక్షల మేర ఆదాయాన్ని ఏజెన్సీ సమకూర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా ప్రాజెక్టు ప్రారంభం కాకముందే ఏజెన్సీ ఆగడాలు ఈ తరహాలో ఉంటే .. పార్కింగ్ ఫీజులు, సౌకర్యాల పేరిట దోపిడీ ఏ తరహాలో ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. బల్దియా కమిషనర్ ఆర్వీకర్ణన్ జోక్యం చేసుకుని ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమాలను నిగ్గు తేల్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.