దుండిగల్, ఫిబ్రవరి 4 : దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్‌లో విల్లాల పేరిట మోసాలకు పాల్పడి రిమాండ్‌లో ఉన్న శ్రీలక్ష్మిశ్రీనివాస కన్స్ట్రక్షన్స్ యజమాని గుర్రం విజయలక్ష్మి(48)ని దుండిగల్ పోలీసులు మంగళవారం విచారించారు. గత నెల 30న విదేశాలకు పారిపోతూ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడింది. అదే రోజు పోలీసులు ఆమెను మేడ్చల్ కోర్టులో ప్రవేశపెట్టగా.. జడ్జి ఆమెకు 14రోజుల పాటు రిమాండ్‌ను విధించారు. అయితే దుండిగల్ పోలీసులు విచారణ నిమిత్తం ఐదురోజులు కస్టడి కోరగా.. కోర్టు ఒక్కరోజు మాత్రమే అనుమతించింది. దీంతో మంగళవారం మధ్యాహ్నం పోలీసులు రిమాండ్‌ఖైదీగా ఉన్న గుర్రం విజయలక్ష్మిని దుండిగల్ పీఎస్‌కు తీసుకువచ్చి సుమారు రెండు గంటల పాటు విచారణ జరిపారు.
విచారణలో విజయలక్ష్మి పోలీసులకు ఏ మాత్రం సహకరించనట్లు తెలుస్తోంది. తాను ఎటువంటి తప్పుచేయలేదని ఒకే ఒక్క సమాధానంతో సరిపెట్టినట్లు తెలుస్తుంది. కాగా మల్లంపేటలోని సర్వేనంబర్ 170/3,170/4,170/5లలో సుమారు 325 విల్లాలను నిర్మించింది. వీటిలో కేవలం సర్వేనంబర్ 170/3లోని 65విల్లాలకు మాత్రమే హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందినట్లు సమాచారం. మిగతా విల్లాలను మాత్రం గ్రామపంచాయతీ నుంచి గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కింద అనుమతులు పొందింది. వీటిలో కొన్ని ఫేక్ అనుమతులు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వభూముల ఆక్రమణ, అక్రమంగా విల్లాల నిర్మాణం, విల్లాల పేరిట కష్టమర్ల నుంచి కోట్లాది రూపాయలు దండుకుని వారికి కనీస వసతులను కల్పించడంతో నిర్లక్ష్యం వహించడంతో వినియోగదారులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం విధితమే. అదే సమయంలో సెప్టెంబర్ 8, 2024న పలువిల్లాలు కత్వాచెరువు ఎఫ్టీఎల్/బఫర్ జోన్లోకి వస్తున్నాయంటూ హైడ్రా 17విల్లాలను కూల్చివేసింది.