ఉస్మానియా యూనివర్సిటీ: లాలాపేటలోని విజయ డెయిరీలో బాయిలర్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా, మరో ముగ్గురికి స్వల గాయాలయ్యాయి. వారిని వెంటనే దవాఖానకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. లాలాపేటలోని విజయ డెయిరీలోని బాదం మిల్క్ బాయిలర్‌ను నిలిపివేసిన తర్వాత 20 నిమిషాల వరకు దాని మూతను తెరవకూడదు. సమయం పూర్తికాకముందే 12 ఏళ్ల అనుభవం ఉన్న రవి బాయిలర్ మూత తెరవడంతో పేలుడు సంభవించింది.
బాయిలర్ మూత పగిలి.. గాజు ముక్కలు చెల్లాచెదురై .. ఒక్కసారిగా ఆవిరి బయటకు రావడంతో రవికి తీవ్ర గాయాలు కాగా.. అక్కడే ఉన్న మీరజ్, చంద్రయ్య, మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన రవిని డీఆర్డీవో అపోలో ఆసుపత్రికి తరలించగా, మిగిలిన వారిని నాచారం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దాదాపు 50 శాతం కాలిన గాయాలైన రవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. రవి గత 12 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఎవరూ నోరు మెదపడం లేదు. భోజన విరామ సమయం కావడంతో కార్మికులు పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.