సిటీబ్యూరో/మాదాపూర్, అక్టోబర్ 15(నమస్తే తెలంగాణ): తమ ఇళ్లు అసలు చెరువు హద్దుల్లోనే లేవంటూ ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా.. హైడ్రా చేస్తున్న వ్యవహారంపై సియేట్ కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హైకోర్టు తమ సర్వే నంబర్లలో తవ్వకాలు జరపవద్దని చెబుతుంటే అర్ధరాత్రి వేళ సున్నంచెరువు ప్రాంతానికి వచ్చి చెరువులో తవ్వకాలు చేస్తున్నామంటూ.. తమ స్థలాల్లోనూ తవ్వకాలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్ని హైడ్రా తరపున చెరువుల అభివృద్ధి కోసం నియమించిన టెక్నికల్ కన్సల్టెంట్ యూనుస్‌ను వివరణ అడుగగా.. 6 చెరువుల విషయంలో ప్రాథమిక నోటిఫికేషన్‌నే పరిగణనలోకి తీసుకుంటున్నామని, ఈ విషయంలో హైడ్రా కమిషనర్ చెప్పినట్లే చేస్తున్నామన్నారు. కోర్టు గతంలో ఈ్రప్రాంతంలో శిథిలాలను తొలగించమని చెప్పిందంటున్నప్పటికీ తాజాగా వచ్చిన ఉత్తర్వుల విషయాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు జరిగిన పనులను సియేట్ కాలనీవాసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన వారితో వాగ్వాదానికి దిగారు. గత కొన్నిరోజులుగా స్థలంలోకి రాని హైడ్రా మళ్లీ ఇక్కడకు వచ్చి తవ్వకాలు చేయడం కరెక్ట్ కాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.