సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): డేటింగ్ యాప్లో పరిచయమైంది. అనాథనంటూ కన్నీళ్లు పెట్టుకుం ది. తన కష్టాలు పోవాలంటే జాబ్ కావాలని అందుకోసం డబ్బులు కావాలని అడిగింది. వాట్సప్ చాటింగ్లో క్లోజ్ అయింది. డబ్బులు కావాలని అడిగి తీసుకుని తిరిగి ఇస్తానంటూ మోసం చేసింది. ఆమె కోసం సంప్రదిస్తే అందుబాటులోకి రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ నగరానికి చెందిన 28 ఏండ్ల యువకుడు ఆన్లైన్ డేటింగ్ యాప్ చాట్ జోజోలో మాడుగుల శరణ్య పేరుతో ఒక యువతి పరిచయమైంది.
తాను అనాథనని, కొన్నిరోజులగా తిండి తినడం లేదని చెప్పింది. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తనకు జాబ్ ఉంటేనే కష్టాలు పోతాయని, అందుకోసం కొంత డబ్బు అవసరమని తెలిపింది. తాను కొన్ని రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పి నమ్మించింది. బాధితుడు ఆమె పరిస్థితిని చూసి జాలితో రూ.95వేలు పలు యూపీఐ అకౌంట్లకు ఆమె చెప్పిన విధంగా పంపించాడు.
ఆ తర్వాత డబ్బు లు చెల్లించమని బాధితుడు అడిగితే బ్యాంక్లో టెక్నికల్ సమస్యలున్నాయని చెప్పి ఇంకా కొంతడబ్బు కావాలంటూ అడిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆ తర్వాత సుభాష్ అనే తన ఇంటి ఓనర్ డబ్బులు ఇస్తాడని నమ్మబలికింది. దీంతో బాధితుడు మళ్లీ రూ.95 వేలు సుభాష్ షేర్ చేసిన యూపీఐ నంబర్లకు పంపారు. దీంతో బాధితుడు మొత్తం 1.9లక్షలు పంపించగా సుభాష్ అతనికి హెచ్డీఎఫ్సీ లింగంపల్లి బ్రాంచ్ వద్ద ఇస్తానని చెప్పి రమ్మన్నాడు. ఎవరూ రాకపోగా.. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.