సిటీబ్యూరో, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ) : నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతగా జస్టిస్ కొండా మాధవరెడ్డి నిలుస్తారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తెలిపారు. దివంగత జస్టిస్ కొండా మాధవరెడ్డి 100వ జయంతి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షతన హైదరాబాద్ గగన్ మహల్‌లోని ఏవీ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరై ప్రత్యేక పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మాట్లాడుతూ కొండా మాధవరెడ్డి ఏపీ, ముంబై హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారని అన్నారు. దూరదృష్టితో న్యాయ, విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక, లెజిస్లేచర్ ప్రశంసనీయంగా పనిచేస్తున్నాయని, దేశంలో దశాబ్ద కాలంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థను అన్ని వర్గాలకు చేరువ చేసేలా స్థానిక భాష వినియోగంలోకి వచ్చిందన్నారు. 99శాతం జిల్లా కోర్టులు సంబంధిత హైకోర్టులకు అనుసంధానం, కొత్తగా క్రిమినల్ కోడ్ బిల్లులకు భారత రాష్ట్రపతి ఆమోదం, శిక్ష కంటే న్యాయంపై దృష్టి పెట్టాయన్నారు. భారత్-2047 అనేది కేవలం దార్శనికత మాత్రమే కాదని.. రానున్న దశాబ్ధ కాలంలో మానవాళికి గొప్ప మార్గదర్శక శక్తిగా మారుతుందన్నారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కొండా మాధవ రెడ్డి జీవిత సారాంశం, ఆయన రచనలు, విలువలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి, ఉస్మానియా వర్సిటీ మాజీ ప్రొఫెసర్ రాంచంద్రారెడ్డి, వీఆర్ రెడ్డి, జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్, పలువురు సిట్టింగ్, మాజీ న్యాయమూర్తులతోపాటు, న్యాయవాద సంఘాల సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.