సిటీబ్యూరో, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ): క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతో పాటు ప్రధానంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా హెల్ప్‌లైన్ ఉచిత సేవలను ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలను ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ, ప్రజలను క్యాన్సర్ బారిన పడకుండా రక్షించడంతో పాటు వ్యాధిపై అవగాహన కల్పించి ప్రారంభ దశలోనే రోగాన్ని గుర్తించి, ప్రాణాపాయం నుంచి తప్పించే ప్రయత్నంలో భాగంగా దేశ వ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ హెల్ప్‌లైన్ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సేవలు పూర్తి ఉచితమని, ఈ సేవలు అందించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ‘ది అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్’, ‘ది అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా’, బ్రెస్ట్ ఇమ్యాజింగ్ సొసైటీ ఆఫ్ ఇండియా తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు డాక్టర్ రఘురామ్ వివరించారు. అక్టోబర్ మాసాన్ని అంతర్జాతీయ రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా పరిగణించడంతో పాటు దేశ వ్యాప్తంగా ఉచిత రొమ్ము క్యాన్సర్ హెల్ప్‌లైన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసువచ్చారని అన్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి చార్మినార్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, రాజ్‌భవన్‌తో పాటు కిమ్స్ హాస్పిటల్స్‌పై పింక్ రంగు విద్యుత్ కాంతులను వెదజల్లినట్లు తెలిపారు.