Passport Office | బేగంపేట్, జూన్ 8 : సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం చుట్టూ అక్రమ పార్కింగ్‌కు అడ్డాగా మారింది. రోజు వందలాది వాహనాలు పాస్‌పోర్ట్ కార్యాలయం చుట్టు పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో స్థానికులు రాకపోకలు సాగించలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మహంకాళి ట్రాఫిక్ పోలీసులు పాస్‌పోర్ట్ కార్యాలయం చుట్టు వాహనాలు పార్కింగ్ చేయకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నో పార్కింగ్ బోర్డు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది..
పాస్‌పోర్ట్ కార్యాలయం కుడి వైపు బస్తీ ఉంది. ఈ బస్తీ వాసులంతా కుడి వైపు ఉన్న రోడ్డు గుండానే ఇండ్లకు వెళ్లాలి బయటకు రావాల్సి ఉంటుంది. పాస్‌పోర్టు కార్యాలయం వెనక భాగంలో ఉన్న రోడ్డు గుండా మోండా మార్కెట్, ఇటు క్లాక్ టవర్ వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రెండు రోడ్లకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ కుడి వైపు ఉన్న రోడ్డును ఇక్కడి స్థానికులు, వాహనదారులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ కార్యాలయానికి వచ్చిన వారంత ఈ రోడ్డుకు ఇరువైపుల వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్‌లతో పాటు వాహనాలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో పాటు అక్కడ రోడ్లపై ఆవులు తిష్ట వేస్తుంటాయి. మరి ఇదంతా ట్రాఫిక్ పోలీసులకు తెలియదా అంటే వారు అక్కడే ఉంటారు. కానీ ఏమీ పట్టించుకోరని బస్తీ వాసులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
సార్ మా బస్తీ వాసులు ఎలా బయటకు రావాలి అంటే వారిదగ్గర సమాధానం ఉండదు. ఇదే రోడ్డులో స్థానికుల ఇంటి ముందు వారి వాహనాలను పార్కింగ్ చేస్తే వారికి రోజు వచ్చి చలానాలు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి రోడ్డుకు ఇరువైపుల వాహనాలను పార్కింగ్ ఎలా చేస్తున్నారు సార్ అంటే అవన్ని మమ్మల్ని మీరు అడగవద్దు అంటూ దబాయిస్తున్నారని అక్కడి స్థానికులు వాపోతున్నారు. సంబధిత ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇక్కడ పాస్‌పోర్ట్ కార్యాలయం కుడి బాగంలో ఉన్న రోడ్డులో వాహనాల పార్కింగ్‌ను నిరోధించాలని బస్తీ వాసులు కోరుతున్నారు.