ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీలోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిరోధించాలంటూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. బోనాల నేపథ్యంలో బయటి వ్యక్తులు సైన్స్ కళాశాల సమీపంలో సోమవారం మద్యం సేవిస్తుండగా విద్యార్థులతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్నవారు పలువురు విద్యార్థులపై దాడికి పాల్పడ్డా రు.
ఆగ్రహించిన వివిధ విద్యార్థి సంఘాల నాయకులు సోమవారం సాయంత్రం ఆర్ట్స్ కళాశాల ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, ఓయూ భద్రతా సిబ్బంది వైఫల్యమేనని ఆరోపిస్తూ మంగళవారం పరిపాలనా భవనం ముట్టడికి పిలుపునిచ్చారు. ఎన్ఎస్యూఐ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పలువురు విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి, రాస్తారోకో చేపట్టారు.
ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓయూ క్యాంపస్‌లో మద్యం ఏరులై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చుట్టుపక్కల బస్తీ వాసులు ఓయూలో పలు చోట్ల టేబుళ్లు వేసుకుని మరీ దావత్‌లు చేసుకున్నారని, దీనిని ప్రశ్నించిన విద్యార్థులపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వర్సిటీని క్లోజ్డ్ క్యాంపస్‌గా మార్చాలని డిమాండ్ చేశారు.