బడంగ్‌పేట : రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ విద్యా వైద్యానికి పెద్ద పీట వేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12 సంవత్సరాల పైబడిన పిల్లలు 15లక్షల ఉన్నట్లు గుర్తించడం జరిగింద న్నారు. రంగారెడ్డి జిల్లాలో 1.22లక్షలు మంది పిల్లలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. వారందరికి వ్యాక్సిన్ వేయించడానికి తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు టీకా వేయించాలన్నారు.
కరోనా కట్టడికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్ని రకాల చర్యలు తీసుకున్నారని ఆమె అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని మార్గ దర్శకంగా తీసుకుంటున్నాయని ఆమె తెలిపారు.
కరోనా సమయంలో వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్, ఆశవర్కర్లు, మున్సిపల్ సిబ్బంది ప్రతి ఇంటికి పోయి ఫివర్ సర్వే చేయడం వలన మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నాట్లు పేర్కొన్నారు.
నగరంలో 250 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 19 బస్తీ దవాఖానలు ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. నగరంలో నాలుగు కార్పొరేట్ దవాఖానలు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో ఇంగ్లీష్ విద్యను అమలు చేయడం పై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ నాగేశ్వర్ , డాక్టర్ రవి కుమార్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.