Khairatabad Ganesh | కోట్లాది మంది భక్తలకు కొంగుబంగారంగా నిలిచి ప్రతి ఏడాది భిన్నమైన రూపాలతో కనిపించే ఖైరతాబాద్ మహాగణపతి ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో కనువిందు చేయనున్నాడు. వీటితో పాటు కుడివైపు పది అడుగుల అయోధ్య బాలరాముడు విగ్రహం, ఎడమ వైపు తొమ్మిది అడుగుల ఎత్తులో రాహు, కేతుల విగ్రహాలు, మూడు అడుగుల మూషికాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. కుడి వైపు 15 అడుగుల మండపంలో తొమ్మిది అడుగుల ఎత్తులో లక్ష్మి, శ్రీనివాసుడి విగ్రహాలు, ఎడమవైపు మండపంలో అంతే ఎత్తులో పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.
-ఖైరతాబాద్
‘అన్ని రంగాల్లో టెక్నాలజీదే ముఖ్యపాత్ర’
శామీర్‌పేట : కృత్రిమ మేధ సాంకేతికత, చట్టం, న్యాయానికి మధ్య ఉన్న సంబంధాలపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని నల్సార్ వీసీ కృష్ణదేవరావు అన్నారు. శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో శనివారం లా కమిషన్ ఆఫ్ ఇండియా సహకారంతో కృత్రిమ మేధ, చట్టం, న్యాయం అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో సాంకేతికత ప్రముఖ పాత్ర పోషిస్తున్నదన్నారు. అందులో భాగంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందుతున్న కృత్రిమ మేధకు చట్టం, న్యాయానికి ఉన్న సంబంధంపై అవగాహన అవసరమన్నారు. నాస్కామ్ మాజీ డైరెక్టర్ డాక్టర్ బీవీ ఆర్ మోహన్‌రెడ్డి, లా కమిషన్ ఆఫ్ ఇండియా మెంబర్ సెక్రటరీ డాక్టర్ రీతావశిష్ట్ తదితరులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఎమ్మెల్యే మర్రి రక్తదానం
మల్కాజిగిరి, ఆగస్టు 10: రక్తదానం చేసి ప్రాణాలను కాపాడుదామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దుండిగల్‌లోని అరుంధతి దవాఖానలో తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం ఆయన రక్తదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తలసీమియా వ్యాధిగ్రస్తులకు తరచూ రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందని, రక్తదాతల కొరతతో వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే ప్రమాదాలు జరిగిన వారి ప్రాణాలను కాపాడేందుకు అత్యవసరంగా రక్తాన్ని ఎక్కించాల్సి ఉంటుందన్నారు. మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు రావాలని, రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు రావని చెప్పారు.