బంజారాహిల్స్, ఏప్రిల్ 13: వ్యవసాయ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వినియోగంతో మెరుగైన ఫలితాలు రాబట్టే అవకాశం ఉందని పంజాబ్లోని గురుకాశి విశ్వ విద్యాలయం డైరెక్టర్ డాక్టర్ అశోక్ సేథీ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. మారిన కాలంతో పాటు అన్ని రంగాల్లో కొత్త విధానాలు వచ్చాయని, వ్యవసాయ రంగంలో సైతం ఏఐ వినియోగం త్వరలో అందుబాటులోకి రానుందన్నారు.
ఏఐ ఆధారిత అగ్రికల్చర్, బీటెక్ కోర్సులు
దీన్ని దృష్టిలో పెట్టుకుని గురుకాశీ విశ్వవిద్యాలయంలో ఏఐ ఆధారంగా అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు బీటెక్ కోర్సులు అందిస్తున్నామని వెల్లడించారు. ఏ సమయంలో విత్తనాలు వేయాలి.. ఎంత మోతాదులో ఎరువులు వేయాలి.. చీడ పురుగులు వస్తే పురుగుల మందులు ఎప్పుడు పిచికారీ చేయాలనే అంశాలపై రైతులకు ఏఐ ద్వారా అవగాహన కల్పిస్తే అధిక దిగుబడి సాధించొచ్చని ఆయన అన్నారు.
ఎప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది.. వేడిశాతం ఎంత ఉందని.. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఏఐ ఆధారంగా గుర్తించొచ్చన్నారు. పంట ఎదిగే విధానాన్ని ఏఐ ద్వారా గుర్తించొచ్చనీ, పురుగు మందుల వినియోగం తదితర అంశాలన్నీ ఏఐ ఆధారిత అగ్రికల్చర్ కోర్సుల్లో తాము అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మ్యాస్టో్ర డైనమిక్ సీఈఓ భావన్ రెడ్డి, సింధుజ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.