హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఆ కాంట్రాక్టు సంస్థ ఓ బడా కాంగ్రెస్ నేతది. రెండేండ్లలో పూర్తి చేయాల్సిన ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆరేండ్లుగా సాగదీస్తున్నది. నిబంధనల ప్రకారం ఏజెన్సీని రద్దు చేసి మరొకరితో పనులు చేయించాల్సిన కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ… అలా చేయకుండా పదే పదే గడువు పొడిగిస్తూ సదరు సంస్థ పట్ల తమ విధేయత చాటుకుంటున్నది. ఇదీ ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పరిస్థితి. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. ఈ ఫ్లైఓవర్ విషయంలో మాత్రం ఒకరికొకరు సహకరించుకోవడం వెనుక ఉన్న మతలబు ఏమిటో అంతుబట్టడంలేదు.
వరంగల్ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులను నివారించే ఉద్దేశంతో రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(ఎంఓఆర్టీఏహెచ్) ఆధ్వర్యంలో ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పనులకు మే 2018లో శంకుస్థాపన చేయగా, 18 నెలల్లో పనులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఓ ప్రముఖ కాంగ్రెస్ నాయకుడికి చెందిన ఏజెన్సీ(గాయత్రీ కన్స్ట్రక్షన్స్) పనులు చేపట్టింది. పనులను మే 2021లోగా పూర్తిచేయాలని నిర్ణయించారు. మొత్తం రూ. 675 కోట్లతో 45మీటర్ల వెడల్పు 6.2 కిలోమీటర్ల పొడవునా ఈ కారిడార్‌ను నిర్మిస్తున్నారు.
గాయత్రీ కన్స్ట్రక్షన్స్కు కేటాయించిన కాంట్రాక్టును రద్దుచేసి పనులు త్వరితగతిన పూర్తిచేయాల్సిన కేంద్రం… ఫ్లైఓవర్‌కు ఇరువైపు గుంతలు లేకుండా చేసి వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా చూడాలని ఆర్ అండ్ బీ శాఖకు ఉచిత సలహా ఇస్తున్నది. ఇరువైపులా రోడ్డు పునరుద్ధరణ పనులకు సదరు ఏజెన్సీకి చెందిన ఈఎండీ నుంచి రూ. 4 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఆర్అండ్బీ అధికారులు రోడ్డు మరమ్మతు పనులు చేపట్టగా, ఇవి సవ్యంగా సాగకపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఫ్లైఓవర్‌కు సుమారు రూ. 500కోట్లపైచిలుకు వ్యయం అవుతుండగా, కాంట్రాక్టు సంస్థ మాత్రం 25 శాతం లెస్‌కు, అంటే రూ. 400 కోట్లకు పనులు చేపట్టింది. సదరు ఏజెన్సీ ఎలాగైనా పనులు దక్కించుకోవాలనే ఆశతో గిట్టుబాటుకాని ధరను కోట్ చేసిందని, పనులు చేయలేక చతికిలపడిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు కేవలం రూ. 170 కోట్ల పనులు మాత్రమే పూర్తయ్యాయి. కాంట్రాక్టు రద్దు చేసి ఇతర ఏజెన్సీకి పనులు అప్పగించాలని ఆర్ అండ్ బీ శాఖ ఎంఓఆర్టీఏహెచ్కి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండాపోయింది.