“దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన చోటు చేసుకుంటుంది. రాష్ట్రం పురోగమనం దిశగా అడుగులు వేస్తూ దేశాన్ని ఆశ్చర్య చకితులను చేస్తున్నది. ప్రజలకు నిత్యం సామాజిక పరంగా, ఆర్థిక పరమైన అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. ఉద్యమ నేపధ్యం నుంచి తొమ్మిదేండ్ల పాలన వరకు బీఆర్ఎస్తోనే నేను, నా అనుచరవర్గం పని చేశాం. ఎక్కడా ఎలాంటి తోట్రుపాటు జరగకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశాం. ఇక ముందు కూడా ప్రజలకు అండగానే ఉంటూ సేవలు అందిస్తాను.”
ఉప్పల్, ఆగస్టు 25: ప్రజా సేవకుడిగా, ప్రజలలో ఒకడిగా ఉంటూ.. మీ కోసమే పనిచేస్తానని, ప్రజలకు తోడుగా, అండగా ఉంటానని ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజల ప్రేమ, అభిమానం కోసం తమ వద్దకు వస్తానని ప్రజలను ఉద్దేశించి ఆయన అన్నారు. ప్రజా సేవకుడిగా, సామాజిక సేవలందిస్తూ, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా గుర్తించి, ప్రజలకు తోడుగా ఉంటానని అన్నారు. ఎలాంటి సమస్యలైనా, ఏ కష్టం వచ్చినా.. తమకు బీఎల్ఆర్ అండగా నిలుస్తారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా లక్ష్మారెడ్డిని ప్రకటించిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ. వివరాలు ఆయన ద్వారానే విందాం..!
ప్రజా ప్రతినిధిగా సేవలందించే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నా, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. పార్టీ అధినేత కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతా. కొన్నేండ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా, పార్టీ అప్పగించిన ప్రతి పనిని చేసుకుంటూ వెళ్తున్నాను. పార్టీ నా సేవలు గుర్తించి, అవకాశం ఇవ్వడంతో నా బాధ్యత మరింత పెరిగింది.
ఉప్పల్ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. ఉప్పల్ రూపురేఖలు మార్చే విధంగా ప్రగతి సాధించింది. ఉప్పల్ శిల్పారామం, స్కైవాక్, వైకుంఠ ధామాలు, ఐటీ, రైల్వే బ్రిడ్జి, థీమ్ పార్కులు, ఉప్పల్ భగాయత్ రైతుల సమస్యల పరిష్కారం, తదితర ఎన్నో అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఉప్పల్‌ను మరింతగా అభివృద్ధి చేసే దిశగా కృషిచేస్తాను.
ప్రజా సేవకుడిగా నాకు ప్రజలలో గుర్తింపు ఉంది. బీఎల్ఆర్ ట్రస్టు పేరుతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నాను. విద్యా, వైద్యం, ఆపదలో ఆదుకోవడం, చేయూతనిచ్చే కార్యక్రమాలు, తదితర అంశాలపై ప్రజలకు సేవలు అందించాను. అన్ని వర్గాలకు నా ట్రస్టు ద్వారా సహాయం అందించాను. నియోజకవర్గంలో నా ట్రస్టు ద్వారా లక్షల మందికి సహాయ, సహకారాలు అందించాను. కష్టం వచ్చి నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా వంతు సహాయం అందించాను. నేను చేసిన సేవలు కొనసాగిస్తూ.. మరింతగా ప్రజలకు చేరవేస్తాను.
బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. హ్యాట్రిక్ దిశగా ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయం. దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ప్రజా సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. దేశం గర్వించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం వెళ్లింది. ప్రజలకు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి, మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని ఎన్నో హామీలను ప్రభు త్వం నెరవేర్చింది.
పార్టీ ఆదేశాల మేరకు పనిచేయడం నా బాధ్యతగా భావిస్తాను. సిట్టింగ్ ఎమ్మెల్యేతో కలిసి పనిచేస్తాను. గత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి గెలుపు కోసం పనిచేశాను. నా గెలుపు కోసం పని చేస్తారనే పూర్తి విశ్వాసం నాకు ఉన్నది. ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలను అందరిని కలుపుకొని ముందుకువెళ్తాను. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను.
ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేసి, పార్టీ అధినేతకు బహుమతిగా అందిద్దాం. ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటుందనే నమ్మకాన్ని కలిపిద్దాం. పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, పార్టీ గెలుపునకు కృషి చేయాలి. పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తూ, క్రమశిక్షణ కలిగిన పార్టీగా నిరూపించుకుందాం. కార్యకర్తలే నేడు పార్టీకి బలం, వారి బాధలు నాకు తెలుసు, బాధ్యత గుర్తించాను. వారికి తప్పక న్యాయం జరిగేలా చూస్తాను. గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయం.