ఐటీ ఉద్యోగులకు కరెంట్ కష్టాలు!
మాదాపూర్‌లో నివాసముంటున్న ఒక ఐటీ ఉద్యోగి రెండురోజుల కిందట ఉదయం 9 గంటలకు ల్యాప్‌టాప్ తెరిచాడు. అమెరికాలోని క్లయింట్‌తో సమావేశం ఉంది. మధ్యాహ్నానికి ప్రాజెక్టు సమర్పించాలి. ఉదయం పదిగంటలకు కరెంట్ పోయి సాయంత్రం నాలుగుగంటలకు వచ్చింది. కరెంట్ పోయిన వెంటనే రూటర్ ఆగిపోయింది. ల్యాప్‌టాప్ బ్యాటరీ అయిపోయేలోపు పని పూర్తి చేయాలి.
- అప్రకటిత కోతలతో వర్క్ ఫ్రం హోమ్‌కు ఇబ్బందులు
- ఫిర్యాదులు చేసినా పట్టింపు లేని దక్షిణ డిస్కం సిబ్బంది
- కోతలే లేవంటూ సీఎండీ చెప్పిన తీరుపై మండిపాటు
- నిరంతర విద్యుత్ ఇవ్వాలంటూ ఐటీల డిమాండ్
సిటీబ్యూరో, అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): మాదాపూర్‌లో నివాసముంటున్న ఒక ఐటీ ఉద్యోగి రెండురోజుల కిందట ఉదయం 9 గంటలకు ల్యాప్‌టాప్ తెరిచాడు. అమెరికాలోని క్లయింట్‌తో సమావేశం ఉంది. మధ్యాహ్నానికి ప్రాజెక్టు సమర్పించాలి. ఉదయం పదిగంటలకు కరెంట్ పోయి సాయంత్రం నాలుగుగంటలకు వచ్చింది. కరెంట్ పోయిన వెంటనే రూటర్ ఆగిపోయింది. ల్యాప్‌టాప్ బ్యాటరీ అయిపోయేలోపు పని పూర్తి చేయాలి. మొబైల్ హాట్‌స్పాట్ పెట్టినా నెట్వర్క్ సమస్య వస్తున్నది. ఆన్లైన్ మీటింగ్ మధ్యలోనే ఆగిపోవడంతో ఏం చేయాలో తోచక తన పరిస్థితిని మేనేజర్‌కు స్క్రీన్‌షాట్ తీసి పెట్టాడు.
రెడిట్ వేదికలో ఒక వినియోగదారుడు విద్యుత్ కోతల కారణంగా ఆఫీసు మీటింగులలో కనెక్షన్ తరచూ తెగిపోతున్నదని, జియో మొబైల్ నెట్వర్క్ వేగం కూడా పడిపోతున్నదని రాశారు. అదే చర్చలో దిల్సుఖ్నగర్ ప్రాంతానికి చెందిన మరో వినియోగదారుడు ప్రతీరోజూ కనీసం నాలుగైదుసార్లు తరచూ కరెంట్ పోతున్నదని, దీంతో తమ ఉద్యోగాలు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటున్నదని చెప్పారు. ఇది హైదరాబాద్ వంటి గ్లోబల్సిటీకి చాలా చెడ్డపేరు తెస్తుందని టెకీలు ఆవేదన వ్యక్తం చేశారు.
షేక్‌పేటలోని లక్ష్మణ్‌నగర్ ప్రాంతంలో ఉదయం పదిన్నర నుంచి కరెంట్ లేదు. మధ్యలో రెండుమూడుసార్లు ఒక అరగంట పాటు వచ్చి పోయింది. మరికొన్ని సార్లు కొన్ని సెకన్లు మాత్రమే పవర్ వచ్చి పోతున్నదని ఐటీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాము ఫిర్యాదు చేసినా ఏఐ సమాధానం వస్తున్నదే తప్ప.. సమస్యను పరిష్కరించే సిబ్బంది మాత్రం రావడం లేదని, దీంతో తమ వర్క్ మధ్యలోనే ఆగిపోయి ఉద్యోగపరంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని కొందరు ఉద్యోగులు చెప్పారు. గతంలో వేసవికాలంలో విద్యుత్కోతలపైనే చర్చ జరిగేది. కానీ ఇప్పుడు వర్షాకాలం దాటుతున్న సమయంలోనూ అప్రకటిత కోతలు నగరవాసులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ప్రత్యేకించి జాబ్ చేసే సమయంలో కరెంట్ కోతలతో పడుతున్న ఇబ్బందులను సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్న కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నప్పుడే కరెంట్ సరఫరా నిలిచిపోయిన పరిస్థితిపై సోషల్‌మీడియా కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందంటూ.. ఎద్దేవా చేస్తూ ట్రోల్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత విద్యుత్‌కు ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రంలో రెప్పపాటు కరెంట్ పోకూడదంటూ విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేశారు.
అప్పటి డిమాండ్ కంటే మరో ఆరేండ్ల ముందు డిమాండ్‌ను ఊహించి గ్రిడ్ విఫలమైనా కరెంట్ పోకుండా పవర్ ఐలాండ్‌ను ఏర్పాటు చేశారు. ఇంత పటిష్టమైన వ్యవస్థ రెండేండ్లుగా నిర్వహణలోపాలతో దెబ్బతిన్నదని కొందరు సీనియర్ విద్యుత్ ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు. కరెంట్ డిమాండ్ పెరగడం వాస్తవమే అయినా దానిని తట్టుకొనగలిగే సామర్ధ్యాన్ని పెంచుకోవలసిన అధికారులు ఆ దిశగా ఆలోచనలు చేయకుండా కేవలం మాటలకే పరిమితమవుతూ కమీషన్ల కోసం పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నిర్వహణ లోపాలే కారణం
గ్రేటర్ హైదరాబాద్‌లో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులకు చేరింది. ఈ సీజన్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 4వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ నమోదవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వానలు లేకపోవడం వల్ల పగలూ రాత్రి సాధారణం కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో విద్యుత్ వాడకం అమాంతం పెరిగిపోయింది. ఒక్కరోజులో సుమారు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను హైదరాబాద్ నగరవాసులు వాడుతున్నారు. ఇటీవల కాలంలో అనేకసార్లు గచ్చిబౌలి, శివరాంపల్లి 132 కేవీ సబ్స్టేషన్ల నుంచి దగ్గరలోని 33కేవీ సబ్స్టేషన్లకు సరఫరాలో సమస్యలు తలెత్తాయి. గతంతో పోలిస్తే బ్రేక్డౌన్లు తగ్గాయని అధికారులు చెప్పినా వాస్తవాలు మాత్రం క్షేత్రస్తాయిలో మరోలా ఉన్నాయి.మెట్రోజోన్తో పోలిస్తే మేడ్చల్, రంగారెడ్డి జోన్ల పరిధిలోని సర్కిళ్లలో సెంట్రల్ బ్రేక్ డౌన్ సిస్టమ్ లేదు. ఆపరేషన్ సిబ్బందినే సర్దుబాటు చేసుకుని షిప్టుల్లో పనిచేయించాల్సి వస్తోంది.
ఒక్కో ఫీడర్ దూరం, పని చేసే పరిధి ఎక్కువ కిలోమీటర్లు ఉండడంతో వినియోగదారుల ఫిర్యాదుదారులకు హాజరు కావడానికి చాలా సమయం పడుతున్నదని విద్యుత్ సిబ్బంది తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నదని గణాంకాలు చెబుతున్నప్పటికీ నిర్వహణ లోపాల కారణంగా ఫీడర్లు ట్రిప్ అవ్వడం, డీటీఆర్లు చెడిపోవడం, వంటి పలు రకాల సమస్యలు ప్రస్తుతం డిస్కంను వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా గంటల కొద్దీ నిలిచిపోతూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. వినియోగదారుల ఫిర్యాదులను అటెండ్ చేయాలంటే అక్కడ లోపాలను సరిదిద్దాలని, ఇందుకు కావాల్సిన సామగ్రి అందుబాటులో లేకపోవడంతో చాలాసార్లు గంటల కొద్దీ సమయం పడుతున్నదని, ఒక్కోసారి పక్క సెక్షన్ నుంచి సామగ్రి తెచ్చి సర్దుబాటు చేస్తున్నామని కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పారు.
అప్రకటిత కరెంట్ కోతలు..
అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్క్‌ఫ్రం హోమ్ ఉద్యోగులు అయితే తమ ఇంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగానే ఎక్స్‌వేదికగా పోస్టులు పెడుతున్నారు. అధికారులు స్పందించి నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలంటూ కోరుతున్నారు. కానీ వారి ఫిర్యాదులకు స్పందన లేకపోగా సిబ్బంది మాత్రం తమకు కుదిరినప్పుడే కరెంట్ ఇస్తామంటూ కొంత దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నగరంలోని మాదాపూర్, కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, మణికొండ, ఎల్బీనగర్, అల్వాల్, ఉప్పల్, చందానగర్, బోయిన్పల్లి, నిజాంపేట, మెహదీపట్నం, అమీర్‌పేట, చార్మినార్ సెక్షన్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులు తమ ప్రాంతంలో కరెంట్ పోగానే వెంటనే ఎక్స్ వేదికగా పోస్టులు చేస్తున్నారు. తమ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, వాస్తవ పరిస్థితులు తెలుపడానికి తమ ఫిర్యాదులను స్క్రీన్‌షాట్ తీసి తమ టీమ్ లీడర్‌కు పంపిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్లెయింట్లకు సేవలందించే ఐటీ ఉద్యోగులు నగరంలో విద్యుత్ అంతరాయాలపై సోషల్‌మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల విద్యుత్‌కోతలపై తాము ఇచ్చిన ఫిర్యాదులకు సిబ్బంది స్పందించే తీరుపై మండిపడుతున్న పరిస్థితి ఉంది. అసలు కరెంట్ కోతలే లేవని, అక్కడక్కడ సాంకేతిక కారణాలతో ట్రిప్ అయి సరఫరా నిలిచిపోతే వెంటనే పునరుద్ధరిస్తున్నామని సీఎండీ జితేశ్ పాటిల్ చెప్పినా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి మాత్రం ఆయనకు తెలియడం లేదా లేక తమ సంస్థ లోపాలను ఒప్పుకోలేని పరిస్థితుల్లో అలా చెబుతున్నారా అంటూ డిస్కంలో చర్చ జరుగుతోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

