వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 9: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR)లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్‌కు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శంకుస్థాపన చేశారు. రూ.250 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్ కోసం అధునాతన హంగులతో నిర్మిస్తున్న అధునాతన భవనాలకు ఆయన భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. విశాలమైన స్థలం, అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో తృణధాన్యాల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఐఐఎంఆర్‌లో అదనపు గదులు ఏర్పాటు చేసి మిల్లెట్లపై పరిశోధన చేసి, దిశానిర్దేశం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశోధన కేంద్రం కోసం రూ.250 కోట్లతో ఇక్కడ అధునాతన భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. కరోనా అనంతరం మిల్లెట్ ఆహారానికి జనాలు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. 2024-25 సంవత్సరంలో మిల్లెట్స్‌పై నిర్వహించిన ప్రత్యేక సదస్సులకు మంచి ఫలితాలు వచ్చాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే మిల్లెట్స్ సాగు చేసిన రైతులకు మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే తృణ ధాన్యాల్లో నూతన వంగడాలను సృష్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.