సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసుల్లో నిందితులకు రాచకొండలో వేగంగా శిక్షలు పడుతున్నాయి. రెండుమూడేళ్ల క్రితం నమోదైన కేసులలో న్యాయస్థానాలు తుది తీర్పులు వెలువరుస్తున్నాయి. చేసిన నేరానికి నిందితులకు కఠిన శిక్షలు న్యాయస్తానాలు విధిస్తున్నాయి. నేరాలలో నిందితులకు శిక్షలు పడడంలో రాచకొండ కమిషనరేట్ రాష్ట్రంలోనే మొదటి వరుసలో ఉంది. గత బీఆర్ఎస్ పాలనలో కేసుల దర్యాప్తుపై యూఐ(అండర్ ఇన్వెస్టిగేషన్) మేళాలు నిర్వహిస్తూ కేసుల దర్యాప్తును వేగంగా చేయడానికి పునాదులు వేశారు.
కేసులను వేగంగా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించి నేరం చేసిన వారికి పక్కగా శిక్షలు పడే విధంగా చేయాలని అధికారులు సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. ఇలా చేస్తూ కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇలా చేయడంతో గత నాలుగేండ్ల నుంచి రాచకొండ కమిషనరేట్‌లో శిక్షల శాతం క్రమంగా పెరుగుతూ వస్తున్నది.. ఇందులో భాగంగా పోక్సో కేసులలోను నేరస్తులకు శిక్షలు వేగంగా పడే విధంగా దర్యాప్తులు పూర్తి చేస్తున్నారు. ఇలా కేసులను వేగంగా దర్యాప్తు చేయడంతో న్యాయస్థానాలు కూడా ఆయా కేసులను వేగంగా పాస్ట్ ట్రాక్ కోర్టులలో తీర్పులు వెలువరుస్తున్నాయి.
గత పది రోజుల్లో వెలువడిన కొన్ని శిక్షలు
చైతన్యపురి పోలీస్స్టేషనప్ పరిధిలోని పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి మాయ మాటలతో ఒక మైనర్ బాలికను ఆడుకుందామని పిలిచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై 2022లో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి చార్జిషీట్‌ను దాఖలు చేశారు. నిందితుడు వెలిశాల సుధాకర్‌కు రంగారెడ్డి జిల్లా ప్రాస్ట్ ట్రాక్ కోర్టు ఇటీవల నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష. రూ. 25 వేల జరిమాన విధించింది.
2019 లో పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మైనర్ బాలుడిపై ఒక వ్యక్తి అసహజ రీతిలో లైంగిక దాడి చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితుడు మహమ్మద్ ఇద్రీస్‌పై పోలీసులు అభియోగాలు నమోదు చేసి, తగిన ఆధారాలతో కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంతో ఇటీవల నిందితుడికి పదేండ్ల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది.
సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కంప్యూటర్ అపరేటర్‌గా పనిచేస్తున్న సుమంత్‌రెడ్డి, ఒక కళాశాలకు చెందిన మైనర్ బాలికతో పరిచయం పెంచుకొని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై పోలీసులు 2019లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. తాజాగా న్యాయస్థానం.. నిందితుడికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.