పైసలిస్తే అంతా ఓకే
నగరంలో పలు చోట్ల కొందరు పార్టీ నిర్వాహకులు ధనార్జనే ధ్యేయంగా కనీస అనుమతులు లేకుండానే ఈవెంట్లకు తమ ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లను అద్దెకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
- నిబంధనలకు నీళ్లొదులుతున్న రిసార్ట్స్, ఫాంహౌస్‌లు
- అనుమతులు లేకుండానే యథేచ్ఛగా ఈవెంట్లు, పార్టీల నిర్వహణ
- ముడుపులిస్తే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న పోలీసులు
నగర శివారు ప్రాంతాల్లోని మల్కాజిగిరి, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్ల పరిధిలో కొన్ని ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రేవ్ పార్టీలకు స్థావరాలుగా ఉన్న వీటిలో ఇప్పటికీ గుట్టుచప్పుడు కాకుండా రకరకాల ఈవెంట్లు, పార్టీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): నగరంలో పలు చోట్ల కొందరు పార్టీ నిర్వాహకులు ధనార్జనే ధ్యేయంగా కనీస అనుమతులు లేకుండానే ఈవెంట్లకు తమ ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లను అద్దెకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మద్యం వినియోగించే ఈవెంట్లకు ఆబ్కారీ శాఖ నుంచి డీజే నిర్వహణకు పోలీసుల అనుమతి తీసుకోవాలి. అనుమతులు లేని అశ్లీల నృత్యాలు, రేవ్ పార్టీలు, వ్యభిచారం, డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగానికి ఈ కేంద్రాలను వాడుతున్న సమాచారం.
దొరికితే దొంగలు.. దొరక్కపోతే దొరలు!
నగర శివారులోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో సుమారు 100కుపైగా ఫాంహౌస్‌లు, 50కిపైగా రిసార్ట్స్‌లు ఉన్నట్లు అంచనా. వీటిలో నిత్యం ఏదో ఒకచోట వివిధ రకాల ఈవెంట్లు, పార్టీలు జరుగుతుంటాయి. వారాంతాల్లో అయితే దాదాపు అన్ని ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లు కిటకిటలాడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కడ, ఎలాంటి పార్టీలు జరుగుతున్నాయనే దానిపై స్పష్టమైన నిఘా లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది నిర్వాహకులు స్థానిక పోలీసులకు నెలవారీ ముడుపులు చెల్లిస్తుండటంతో వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ కోణంలో ఫిర్యాదులు అందినా, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినా మాత్రమే పోలీసులు హడావుడి చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు నెలవారీ ముడుపులు చెల్లించని నిర్వాహకులపై మాత్రం కేసులు పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసుల దాడుల్లో పట్టుబడితే నిందితులుగా, దొరక్కపోతే దర్జాగా కార్యకలాపాలు సాగించుకోవచ్చనే పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మహారాష్ట్ర, కర్ణాటక నుంచి క్యూ!
ఒకప్పుడు ఏపీ, తెలంగాణకు చెందినవారే ఎక్కువగా ఈ ఫాంహౌస్లల్లో పార్టీలు చేసుకునేవారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి యువకులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో నగర శివార్లకు వస్తున్నట్లు సమాచారం. ఆయా రాష్ర్టాల నుంచి మూడు, నాలుగు గంటల్లోనే హైదరాబాద్ శివారు ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉండటంతో కార్లలో గుంపులుగా వచ్చి శివారుల్లోని హోటళ్లలో బస చేస్తున్నట్లు తెలుస్తోంది.అనంతరం స్థానిక బ్రోకర్లను సంప్రదించి, వారి ద్వారా శివారు ప్రాంతాల్లోని ఫాంహౌస్‌లను బుక్ చేసుకుంటున్నట్లు సమాచారం.
పార్టీలకు అవసరమైన ఏర్పాట్లతోపాటు యువతులను కూడా బ్రోకర్లే సమకూరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పగలంతా పనులు చూసుకుని, రాత్రి కాగానే బ్రోకర్లు సూచించిన ఫాంహౌస్‌లకు చేరుకుని మద్యం, మాంసాహారం, పేకాటతో జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పార్టీలకు యువకులు, వ్యాపారులే కాకుండా కొందరు మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది కూడా హాజరవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముడుపుల మాయాజాలం!
ముడుపుల కోసం లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఆబ్కారీ శాఖ అధికారులు వేధిస్తున్నారని పలువురు రిసార్ట్, ఫాంహౌస్ నిర్వాహకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈవెంట్లు జరిగినా.. జరగకపోయినా నెలవారీ ముడుపులు చెల్లించాల్సిందేనని.. లేదంటే కేసులు పెటి వేధిస్తున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. ముడుపులు చెల్లించే వారికి ఎలాంటి నిబంధనలు వర్తించనట్లు వ్యవహరిస్తున్నారని, దీంతో ఆయా ఫాంహౌస్‌లు, రిసార్ట్‌లలో అన్ని రకాల ఈవెంట్లు యథేచ్ఛగా సాగుతున్నాయని రోపిస్తున్నారు.
ఫాంహౌస్‌లు, రిసార్ట్‌ల నిర్వహణ ఖర్చులతోపాటు అధికారులకు చెల్లించాల్సిన ముడుపుల భారాన్ని భరించాల్సి వస్తోందని, అందుకే కొన్నిసార్లు ఎలాంటి అనుమతులు లేకుండానే ఈవెంట్ల నిర్వహణకు అంగీకరించాల్సి వస్తోందని కొందరు నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం మందగించడంతో ఇటీవల ఈవెంట్ల సంఖ్య తగ్గిపోయిందని, ఫాంహౌస్‌లు, రిసార్ట్‌లకు గిరాకీ పడిపోయిందని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక, కొన్ని సందర్భాల్లో నిబంధనలను పక్కనపెట్టాల్సి వస్తోందని వారు చెబుతుండటం గమనార్హం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

