అక్రమ బోర్లు..కాంగ్రెస్ నేతల పేర్లు
కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో గ్రేటర్ హైదరాబాద్‌లో బోర్లు విచ్చలవిడిగా తవ్వుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పుకొని వేలాది అడుగుల లోతు బోర్లు వేస్తున్నారు.
- వెస్ట్ సిటీలో విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు
- హస్తం నాయకుల పేర్లు చెప్పుకొంటున్న అక్రమార్కులు
- అనుమతులు తీసుకోకుండానే వేల అడుగుల లోతుకు
- వేగంగా పడిపోతున్న భూగర్భ జలాలు
సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో గ్రేటర్ హైదరాబాద్‌లో బోర్లు విచ్చలవిడిగా తవ్వుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్పుకొని వేలాది అడుగుల లోతు బోర్లు వేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో నూతన నిర్మాణాల దగ్గర రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకోకుండా బోర్లు తవ్వుతున్నారు. వర్షాభావంతో భూగర్భ జలాలు అత్యంత లోతుకు పడిపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా బోర్లు వేయొద్దని, ఒకవేళ తప్పనిసరి అయితే అనుమతులు తీసుకోవాలని జీవో 259 ప్రకారం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ ఆ నిబంధనలకు అదే కాంగ్రెస్ నేతలు తూట్లు పొడుస్తూ గ్రేటర్ వ్యాప్తంగా విచ్చలవిడిగా బోర్లు తవ్వుతున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను పాతరేస్తూ ఒకే దగ్గర రోజుల తరబడిగా వేలాది అడుగుల లోతులో బోర్లు తవ్వుతున్నారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటి ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే..
వేలాది అడుగుల లోతులో బోర్లు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తే… తమ నాయకుడు అధికారులతో మాట్లాడారని.. అధికారులు కూడా బోర్లు వేసుకోవచ్చని చెప్పినట్లు బదులిస్తున్నారు. అక్రమ బోర్ల తవ్వకాలు నిర్మాణాలు ఎక్కువగా కొనగుతున్న వెస్ట్ సిటీలోనే జరుగుతున్నాయి. అదేవిధంగా శివారు ప్రాంతాలైన ఎల్బీనగర్, హయత్‌నగర్, ఓఆర్ఆర్ బయటి శివారు ప్రాంతాల్లో అక్రమబోర్లు తవ్వుతున్నారు. బహిరంగంగానే వేలాది అడుగుల లోతులో ఎలాంటి అనుమతులు లేకుండా బోర్లు వేస్తుంటే హైడ్రా, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
జీవో 259 తుంగలో తొక్కుతూ..
వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో 259ని తీసుకొస్తూ నూతనంగా బోర్లు వేయడాన్ని నియంత్రిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. వినియోగ నిబంధనలు-2023 ప్రకారం అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులు, వాణిజ్య-పారిశ్రామిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లు, బల్క్ వాటర్ సప్లయర్లు నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు పొందిన తర్వాతనే కొత్త బోర్లు తవ్వుకోవాల్సి ఉంటుంది. అది కూడా 120 మీటర్ల కంటే ఎక్కువ లోతు వేయకూడదు. అనుమతులు తీసుకున్నా.. తవ్వకం పూర్తయిన 15 రోజుల్లోగా బోర్వెల్ ఆపరేటర్ రెవెన్యూ అధికారులకు వెల్ కంప్లీషన్ నివేదికను సమర్పించాలి. దాన్ని సంబంధిత తహసీల్దార్ దగ్గర తప్పనిపరిగా నమోదు చేయించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించని వారిపై వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చి నెల రోజులుగా పూర్తి కాకముందే అదే కాంగ్రెస్ నేతలు తూట్లు పొడుస్తున్నారు. ఎక్కడా వాటిని పాటించకుండా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వేల అడుగుల లోతులో రోజుల తరబడి నిరంతరాయంగా బోర్లను తవ్వుతున్నారు. రెవెన్యూ, హైడ్రా అధికారులు మాత్రం అటువైపు తొంగి చూడటం లేదు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా బోర్లు తవ్వుతునే ఉన్నారు.
కాంగ్రెస్ నేతల అండదండలు
అక్రమ బోర్ల తవ్వకాలకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు అండగా నిలుస్తున్నారు. వెస్ట్ సిటీ పరిధిలోని నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో బోర్ల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిన నిబంధనలు పట్టించుకోకుండా బోర్లు తవ్వకాలు చేపడుతున్న వారిని ప్రోత్సహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వకున్నా కాంగ్రెస్ నాయకులను ప్రసన్నం చేసుకుంటే… పని పూర్తవుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా బోర్లు వేస్తున్నారని తెలిసి అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులను ఒక్క ఫోన్ కాల్‌తో వెనక్కి పంపుతున్నారని వెస్ట్ సిటీలోని ప్రజలు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వమే బోర్లు తవ్వొద్దని చెబుతూ.. అదే కాంగ్రెస్ నాయకులు అక్రమంగా బోర్లు వేసుకునేందుకు దన్నుగా నిలుస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో 120 మీటర్ల లోతు బోరు వేసేందుకు అనుమతులు తీసుకుని 1000-2000 అడుగుల లోతుకు తవ్వుతున్నారు. ఈ అక్రమ బోర్లు ఎక్కువగా ఫైనాన్షియల్ డిస్ట్రక్ట్, నానక్‌రాంగూడ, కొల్లూరు, తెల్లాపూర్, నల్లగండ్ల, కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి, కోకాపేట, మణికొండ, కుత్బుల్లాపూర్‌లో వెలుస్తున్నాయి. సామాన్యులు ప్రశ్నిస్తే.. తమ వెనుక కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారని బుకాయిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భూగర్భ జలాలు మరింత పడిపోయి తాగు నీటికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం అక్రమ బోర్లను కట్టడి చేయాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

