గ్రేటర్లో సామాన్య, మధ్య తరగతి యువతకు క్రీడల్లో ఓనమాలు నేర్పే జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఇప్పుడు రాజకీయ క్రీడలకు అడ్డాగా మారుతున్నాయి. ‘ప్రైవేట్ నిర్వహణ’ ముసుగులో అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను అధికార పార్టీ నేతలు, వారి అనుచరులకు కట్టబెడుతున్నారు. పారదర్శకతను తుంగలో తొక్కి, బంధుప్రీతికే పెద్దపీట వేస్తూ బల్దియా ఆస్తులను ధారదత్తం చేస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నగర యువత భవిష్యత్తును, క్రీడా స్పూర్తిని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్న తీరుపై క్రీడా ప్రేమికులు భగ్గుమంటున్నారు.
సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్వహణ భారం మోయలేక వాటిని ప్రైవేట్ పరం చేయాలని స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. తొలుత ఖైరతాబాద్ జోన్ పరిధిలో 10 చోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ప్రైవేట్‌కు టెండర్ ప్రాతిపదికన అప్పజెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే పదింటిలో రెండు చోట్ల టెండర్ల ప్రక్రియను పూర్తిచేశారు. ఇందులో జూబ్లీహిల్స్ సర్కిల్-18 పరిధిలోని జూబ్లీహిల్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ (క్రికెట్, టెన్నీస్), షేక్‌పేట స్పోర్ట్స్ కాంప్లెక్స్ (వాలీబాల్, బాక్సింగ్, జిమ్, రోలర్ స్కేటింగ్, షటిల్, బాడ్మింటన్)ల టెండర్ ప్రక్రియను ముగించారు.
ఐతే ఈ రెండింటిలోనూ పొలిటికల్ సిఫార్సులు జరపగా, ఇందులో ప్రముఖమైన ఏరియాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను బల్దియా పెద్దకు సంబంధించిన సోదరుడి కుమారుడికి కట్టబెట్టినట్లు సమాచారం. వాస్తవంగా క్రీడలలో శిక్షణ ఇచ్చే వారంతా ప్రభుత్వ గుర్తింపు పొందిన వారితో కాకుండా అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తులను చేర్చి టెండర్లు దక్కించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో మరో 8 చోట్ల జరిగే టెండర్లలోనూ రాజకీయ జోక్యం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
సామాన్యుడికి ఆట దూరం!
జీహెచ్ఎంసీ ఆస్తులను అధికారులు ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తున్నారు..మౌలిక వసతుల కల్పన, మెరుగైన నిర్వహణతో సంస్థకు ఆదాయాన్ని సమకూర్చుకునే వనరులను సైతం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన క్రీడలను సైతం ఖరీదుగా మార్చే నిర్ణయాన్ని తాజాగా కాంగ్రెస్ సర్కార్ తీసుకుంది. ప్రభుత్వ నిర్వహణలో ఉన్నప్పుడు నామమాత్రపు ఫీజులతో అందుబాటులో ఉన్న ఈ ప్రాంగణాలు, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో వ్యాపార కేంద్రాలుగా మారనున్నాయి. కేవలం డబ్బున్న వారికే ఈ సౌకర్యాలు పరిమితమయ్యే ప్రమాదం ఉంది.
బస్తీల్లో ఉండే పేద, ప్రతిభావంతులైన క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి వేల రూపాయల ఫీజులు కట్టలేక ఈ సౌకర్యాలకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజాధనంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్‌లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడా ప్రాంగణాల ప్రైవేటీకరణ ముసుగులో జరుగుతున్న రాజకీయ దందాను అరికట్టకపోతే నగరంలో క్రీడా స్పూర్తి కనుమరుగైపోయే ప్రమాదం ఉందని క్రీడా ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రైవేట్ కానున్న కాంప్లెక్స్‌లు