బేగంపేట్, జూలై 1: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారి ఘటోత్సవ ఊరేగింపు కార్యక్రమాలు కన్నుల పండువగ సాగుతున్నాయి. ఆదివారం అమ్మవారి ఘటాన్ని తయారు చేసి పోతరాజుల విన్యాసాలతో అంగరంగ వైభవంగా ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. మరో వైపు దేవాలయం ప్రాంగణంలో బోనాల జాతరకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో అమ్మవారికి ఘటోత్సవంతో ఎదుర్కొల కార్యక్రమాలను ఆలయ నిర్వహాకులు, భక్తులు సందడిగా నిర్వహించారు.
రెండువారాల పాటు అమ్మవారి ఘటోత్సవాలను సికింద్రాబాద్ పుర వీధుల్లో ఊరేగించనున్నట్టు ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి తెలిపారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయంతో పాటు అనుసంధానంగా ఉన్న వివిధ అమ్మవారి దేవాలయాలు సైతం లష్కర్లో ఇంటింటా తీసుకువెలుతున్నారు. ఇంటిల్లి పాది కుటుంబ సభ్యులు ఘటాన్ని పూజించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి బోనాల ఉత్సవాలు ఈ నెల 13, రంగం వేడుకలు 14న నిర్వహించనున్నట్టు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు.