సిటీబ్యూరో, మార్చి30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రాజధానిలో ఉగాది వేడుకలు ప్రజలంతా ఘనంగా జరుపుకున్నారు. విశ్వావసు తెలుగునామ సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఇంటిల్లిపాదిగా కలిసి షడ్రుచులు కలిగిన ఉగాది పచ్చడి సేవించారు. కుటుంబసమేతంగా ఆలయాలకు వెళ్లి ఇష్టదైవాలకు అర్చన కార్యక్రమాలు చేయించుకుని, పంచాంగ శ్రవణం విన్నారు. నగర సమీపంలో ఉన్న గ్రామాల నుంచి మామిడికాయలు, మామిడి ఆకులు, వేప ఆకులు, పువ్వులు తీసుకొచ్చి పలువురు రైతులు, వ్యాపారులు నగరంలోని పలు మార్కెట్లు, కూడళ్లలో పండుగ సందర్భంగా విక్రయించారు.
కేబీఆర్ పార్కులో.. పంచె కట్టు వాకింగ్
బంజారా హిల్స్: తెలుగు సంవత్సరాది పురస్కరించుకొని ఉగాది పర్వదినం రోజున తెలుగుదనం ఉట్టిపడేలా కొంతమంది వాకర్లు బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో ఆదివారం పంచె కట్టుతో వాకింగ్‌కు వచ్చారు. ప్రతిరోజు పార్కులో పొట్టి నిక్కర్లు, షారట్స్, పాంట్స్‌తో వస్తుంటామని, ఉగాది రోజున తెలుగు సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చుకునేలా పంచకట్టుతో వచ్చామని వాకర్లు పేర్కొన్నారు. అచ్చమైన సంప్రదాయాన్ని కండ్లకు కడుతూ వచ్చిన వారిని పలువురు అభినందించారు.