సిటీ బ్యూరో, జూలై 14 (నమస్తే తెలంగాణ): యూసీసీఆర్ఐ నాయకత్వ కమిటీ సభ్యుడు విజయ్ మృతి విప్లవ రాజకీయాలకు తీరని లోటని ఆ సంఘం కార్యదర్శి వినోద్ ఒక ప్రకటనలో అన్నారు. తెలుగు రాష్ర్టాల్లోని కమ్యూనిస్టు విప్లవకారులు, శ్రేణుల విశిష్ట నాయకుడిగా ఆయన 50 ఏండ్లు అకుంటిత దీక్షతో పనిచేశారని కొనియాడారు. విజయ్(74) కొన్నేండ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఈనెల 12న మల్టీఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయారని వెల్లడించారు.
కృష్ణా జిల్లా లంకపల్లిలో జన్మించిన విజయ్ ఏరోనాటిక్ ఇంజినీరింగ్‌తో సమానమైన ఏఎంఐఈలో డిగ్రీ చేశారని చెప్పారు. చిన్నప్పటి నుంచే విప్లవ ఉద్యమాలకు ఆకర్షితుడైన విజయ్.. కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఎమర్జెన్సీ కాలమైన 1975-77 నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారని తెలిపారు. ఉద్యమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా క్రమశిక్షణ, నిస్వార్థ దృష్టితో పనిచేసి అనుకున్న లక్ష్యాలను సాధించారని ప్రశంసించారు. విజయ్ మరణం యూసీసీఆర్ఐ, కమ్యూనిస్ట్ విప్లవోద్యమాలకు తీరని లోటని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు విజయ్ చేసిన సేవ చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు.