బంజారాహిల్స్,జనవరి 25: ఇన్‌స్టా రీల్స్‌లో(Insta Reels) వ్యూస్(Views) పెంచుకునే క్రమంలో డీ మార్ట్(D Mart) స్టోర్‌లో చాక్లెట్స్ చోరీ చేయడంతో పాటు ఫ్రీగా చాక్లెట్స్ తినడం ఎలా.. అంటూ వీడియోలు చేసిన యువకుడితో పాటు అతడికి సహకరించిన మరొకరిని ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరకొండ సమీపంలోని చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన హనుమాన్ నాయక్(22) రాయదుర్గం సమీపంలో నివాసం ఉంటూ నారాయణమ్మ కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తుంటాడు.
అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఘట్కేసర్కు చెందిన సిద్దూ (25) అనే యువకుడితో కలిసి గత కొంతకాలంగా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్స్ తయారు చేస్తుంటాడు. ఇటీవల ఇన్‌స్టా రీల్స్‌కు ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏదైనా వెరైటీ వీడియో తయారు చేయాల్సిందే అని నిర్ణయించుకున్న హనుమాన్ నాయక్, సిద్దూ కలిసి షేక్‌పేట ప్రధాన రోడ్డుపై ఉన్న డీ మార్ట్ స్టోర్‌కు వెళ్లారు.
కౌంటర్లో ఉన్న రెండు చాక్లెట్స్‌ను తీసుకున్న హనుమాన్ నాయక్ వాటిని తీసుకుని జేబులో పెట్టుకోవడం.. ఒక షర్ట్‌ను తీసుకుని ట్రయల్ రూమ్‌లోకి వెళ్లి చాక్లెట్స్ తినడంతో పాటు వీడియోలు తీసి ఇన్‌స్టా రీల్స్‌గా పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో డీ మార్ట్ యాజమాన్యం దృష్టికి వెళ్లాయి.
దీంతో ఇతర కస్టమర్లను ప్రభావితం చేయడంతో పాటు తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తూ చాక్లెట్స్ చోరీ చేయడంతో పాటు రీల్స్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిలింనగర్ పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువారం నిందితులు హనుమాన్‌నాయక్. సిద్దూలను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.