మలక్‌పేట, ఏప్రిల్ 23 : ద్విచక్ర వాహనాలను దొంగిలించి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను మలక్‌పేట పోలీసులు అరెస్ట్‌చేశారు. నిందితుల వద్దనుంచి రూ.6 లక్షల విలువైన ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఆదివారం మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ శ్యాంసుందర్, ఇన్స్పెక్టర్ కస్పరాజు శ్రీనివాస్, అడిషనల్ ఇన్స్పెక్టర్(డీఐ) ఎల్.భాస్కర్‌రెడ్డి, డీఎస్ఐ వై.సాయి తేజారెడ్డి వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తంగడుపల్లె గ్రామం బీరప్ప కాలనీకి చెందిన ఒర్సు లింగయ్య కుమారుడు ఒర్సు యాదయ్య(22) కంకర మిషన్‌లో కూలీగా పనిచేస్తున్నాడు.
చెడు వ్యసనాలకు అలవాటుపడిన నిందితుడు యాదయ్య, అదే ప్రాంతానికి చెందిన మరో బాలుడితో కలిసి పార్కింగ్‌చేసిన ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలకు పాల్పడుతున్నాడు. ఆదివారం ఉదయం దొంగిలించిన వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా మలక్‌పేట డీఐ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో మూసారాంబాగ్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న డీఎస్ఐ సాయి తేజారెడ్డి, క్రైం టీం సభ్యులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా వాహనాలు దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. నిందితులవద్దనుంచి ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని నిందితుడు యాదయ్యను రిమాండ్‌కు, మరో నిందితుడు మైనర్‌ను జువైనల్ హోంకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వివిధ కారణాలతో 2023 జనవరి 1నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు సెల్ఫోన్లను పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న క్రైం పోలీసులు రూ.8 లక్షల విలువైన 50 సెల్ఫోన్లను రికవరీచేశారు. ఆదివారం ఏసీపీ శ్యాంసుందర్, మలక్‌పేట ఇన్స్పెక్టర్ కస్పరాజు శ్రీనివాస్, డీఐ ఎల్.భాస్కర్‌రెడ్డి, డీఎస్ఐ సాయితేజారెడ్డి బాధితులకు సెల్ఫోన్లను అందజేశారు.