Bullet Bike | సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): పార్క్ చేసిన బుల్లెట్ బండ్లను కొట్టేస్తూ.. నారాయణపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు అమ్ముతున్న ముగ్గురు సభ్యులున్న ముఠాను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు. గోల్కొండకు చెందిన మహ్మద్ షేక్ ఏసీ మెకానిక్. జీడిమెట్ల పరిధిలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు దొంగిలించిన కేసులో 2023, ఏప్రిల్‌లో అరస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. అనంతరం గోల్కొండ ప్రాంతంలో ఉండే తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు మహ్మద్ ఇమ్రాన్, ఇమ్రాన్‌తో కలిసి గృహాల ఎదుట పార్క్ చేసిన బుల్లెట్, హోండా యాక్టివా, హిరో హోండా వాహనాలను దొంగిలించడం ప్రారంభించారు. వీటిని నారాయణపేట్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ బేరం కుదుర్చుకుంటున్నారు. రూ.25 వేల నుంచి రూ. 50 వేలకే విక్రయిస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటారు.
ఆయా వాహనాలకు అడ్వాన్స్‌గా రూ. 10 వేల నుంచి రూ. 15 వేలు తీసుకొని మిగతా సొమ్ము డాక్యుమెంట్లు ఇచ్చిన తరువాత మిగిలిన అమౌంట్ ఇవ్వాలంటూ అక్కడి నుంచి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక వాహనదారుడు తన ద్విచక్రవాహం పోయిందంటూ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ కేసును చేధించారు. ప్రధాన నిందితుడు మహ్మద్ షేక్, మహ్మద్ ఇమ్రాన్లు చైతన్యపురిలో దొంగిలించిన వాహనాన్ని అమ్మేసి, మరో వాహనాన్ని కొట్టేసి కొత్తపేట నుంచి నాగోల్ వైపు వస్తుండగా చైతన్యపురి పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.46 లక్షల విలువైన 13 రాయల్ ఇన్ఫీల్డ్, 10 హోండా యాక్టివా, మూడు స్ప్లెండర్స్, రెండు హోండా యూనికార్న్, తదితర బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలు ట్రై పోలీస్ కమిషనరేట్లతో పాటు వికారాబాద్, నిజాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందినవని సీపీ తెలిపారు. ముగ్గురిలో ఇమ్రాన్ అనే దొంగ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. ఈ కేసు ఛేదించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బృందాన్ని సీపీ అభినందించారు.